పోటెత్తిన సవాళ్లు.. సంయమనానికి నీళ్లు
eenadu telugu news
Updated : 23/10/2021 06:12 IST

పోటెత్తిన సవాళ్లు.. సంయమనానికి నీళ్లు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు : ఉప ఎన్నికల ప్రచారంలో విమర్శ- ప్రతివిమర్శలే రాజ్యమేలుతున్నాయచి. ఒకరిపై ఒకరు.. ఓ పార్టీపై ఇంకో పార్టీ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై- విపక్ష నేత సిద్ధరామయ్య మధ్య పాలనాపరమైన విమర్శలు శుక్రవారం జోరందుకున్నాయి. వీరికి మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తోడయ్యారు. హావేరిలో మూడు పార్టీలకు చెందిన కీలక నేతలంతా ప్రచారంలో పాల్గొన్నారు. పోలింగ్‌కు ఇంకా వారం రోజుల సమయమే ఉండటంతో పార్టీల ప్రచారం పదునెక్కింది.

l సంక్షేమ పథకాల అమలులో మేమే మేటి అంటూ అధికార- విపక్ష పార్టీ నేతలు ఎవరికి వారే ప్రకటించుకున్నారు. బొమ్మై, యడియూరప్ప, సిద్ధరామయ్య వేర్వేరు సమయాల్లో హానగల్‌లో తమతమ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. తొలిసారిగా బొమ్మై- అప్ప కలిసి ఓట్లవేటలో పాల్గొన్నారు. వీరిద్దరూ విపక్ష నేత నిత్యం ప్రకటించుకునే అన్నభాగ్య, ఉచిత నివాసాల పథకాలపై విమర్శించారు. కేంద్ర సర్కారు సింహభాగం అందించే అన్నభాగ్యను తన సాధనగా ప్రకటించుకునే సిద్ధరామయ్య ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. యడియూరప్ప స్పందిస్తూ.. మరో 50 ఏళ్ల వరకు కాంగ్రెస్‌ చిరునామా లేకుండా పోతుందని జోస్యం చెప్పారు.

l కాంగ్రెస్‌ పార్టీ చేసిన అభివృద్ధిని తన సాధనగా ప్రకటించుకునే ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారంతో బలం పెంచుకున్నారని సిద్ధరామయ్య ఆరోపించారు. ఈ క్షేత్ర అభివృద్ధి గురించి మాజీ ఎమ్మెల్యే మనోహర్‌ తహసీల్దారును అడిగితే వివరిస్తారన్నారు. ఇక్కడ ఓడిపోతామని భాజపా నేతలకు తెలిసిపోయిందన్నారు. ఆ కారణంగానే నగదు పంపిణీ చేసేందుకు మంత్రివర్గాన్ని ఇక్కడ తిష్ట వేయించినట్లు దుయ్యబట్టారు. కేంద్ర సర్కారు కరోనా నియంత్రణలో వాస్తవాలు కప్పిపుచ్చినట్లే- రాష్ట్ర సర్కారు ఆర్థిక సమస్యల సాకు చూపుతున్నట్లు ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల్లో పంచేందుకు కమలనాథులకు డబ్బెక్కడిదని ప్రశ్నించారు. సిద్ధు ఆరోపణను మంత్రి మురుగేశ్‌ నిరాణి తోసిపుచ్చారు. గూఢచార వ్యవస్థ ఇచ్చిన సమాచారం కొన్నిసార్లు నిజం కాకపోవచ్చన్నారు. ఇక్కడ భాజపా గెలుస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

l సిందగిలో కచ్చితంగా ఓడిపోతామన్న భయంతోనే కాంగ్రెస్‌ మా పార్టీనేత అశోక్‌ మనగొళికి గాలం వేసినట్లు జేడీఎస్‌ నేత కుమారస్వామి ఆరోపించారు. సిందగిలో రెండు జాతీయ పార్టీల ప్రభావం శూన్యమన్నారు. ఇక్కడ పోటీ భాజపా- జేడీఎస్‌ మధ్య మాత్రమేనన్నారు. గడచిన రెండు దశాబ్దాలుగా మూడో స్థానానికే పరిమితమైన కాంగ్రెస్‌ ఓటమి భయంతోనే అశోక్‌ మనగొళిని కాంగ్రెస్‌లోనికి ఆహ్వానించినట్లు ఆరోపించారు. ప్రజలకు జేడీఎస్‌ పార్టీపై ఉన్న విశ్వాసమే శ్రీరామ రక్ష అన్నారు. ఆయన శుక్రవారం ఉదయం సిందగి నుంచి హానగల్‌కు చేరుకున్నారు. శనివారం నుంచి రెండు రోజుల పాటు హానగల్‌లో ప్రచారం చేయనున్నారు.

ఖాళీ సంచులూ వదల్లేదే..

హానగల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సిద్ధరామయ్య

హావేరి, న్యూస్‌టుడే : జిల్లాలోని హానగల్‌ ప్రాంతంలోని సంగూరు చక్కెర కర్మాగారాన్ని స్వార్థం కోసం నష్టాల్లోకి నెట్టారని భాజపా నేతలపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన హానగల్‌ నియోజకవర్గంలోని నరేగల్‌ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చక్కెర కర్మాగార నష్టాలకు కారణమైన ప్రస్తుత భాజపా అభ్యర్థి శివరాజ్‌ సజ్జనార్‌ను.. రూ.33 లక్షలను చెల్లించాలని అప్పట్లో ఆదేశించిన విషయాన్ని విస్మరించారా అని ప్రశ్నించారు. సంస్థకు చెందిన గౌరాపుర ప్రాంతంలోని 21 ఎకరాల భూమిని కాజేసిన శివరాజ్‌ను గెలిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించాలన్నారు. అక్కడి ఖాళీ సంచుల్ని కూడా నేతలు విడిచిపెట్టలేదని ఎద్దేవా చేశారు. ప్రచార సభలో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సిద్ధు పథకాల ఫలం నాస్తి

హానగల్‌ ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప

హావేరి, న్యూస్‌టుడే : తన హయాంలో ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్ఛా. మరెన్నో పథకాల్ని చేపట్టానని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తనదైన శైలిలో తిప్పికొట్టారు. ఆయన శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి హానగల్‌ నియోజకవర్గం పరిధిలోని బొమ్మనహళ్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పథకాల్ని కేవలం ప్రకటించడంతోనే సరిపోదన్నారు. పథకాలన్నీ కాగితాలకే పరిమితమైతే ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి ఒకే వాహనంలో ప్రయాణించారు. ముఖ్యమంత్రిగా ముందు సీట్లో కూర్చోవాల్సిందిగా యడియూరప్ప సూచించగా అందుకు బొమ్మై నిరాకరించారు. ముందు సీట్లో మీరే కూర్చోవాలంటూ ఆహ్వానించారు. మంత్రి మురుగేశ్‌ నిరాణితో కలిసి ముఖ్యమంత్రి వెనుకసీట్లో కూర్చుని ప్రచారానికి పయనమయ్యారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని