డిసెంబరు నాటికి అందరికీ టీకా
eenadu telugu news
Published : 23/10/2021 01:19 IST

డిసెంబరు నాటికి అందరికీ టీకా


న్యూమోనియా అరికట్టే టీకా వేస్తున్న ముఖ్యమంత్రి బొమ్మై

హుబ్బళ్లి, న్యూస్‌టుడే : రాష్ట్రంలో కరోనా టీకాల ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఆదేశించారు. ఆయన శుక్రవారం ఇక్కడి కిమ్స్‌ ఆసుపత్రిలో న్యుమోనియా టీకాను విడుదల చేశారు. 70 శాతం మంది ప్రజలకు రెండో డోసు టీకాల్ని వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. వివిధ వైద్యశాలల్లో ఏడాది కాలంలోనే 1.25 లక్షల పడకల్ని అదనంగా అందుబాటులోకి తెచ్చామన్నారు. నాలుగు వేల మంది వైద్యులను నియమించామని చెప్పారు. తాలూకా ఆసుపత్రుల్లోనూ ప్రసుత్తం ఆక్సిజన్‌ పడకలు ఏర్పాటైన విషయాన్ని గుర్తుచేశారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో కిమ్స్‌ ఆసుపత్రి సేవల్ని కొనియాడారు. ఈ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏడు జిల్లాల్లో వైద్య సేవలు లభిస్తున్నాయని చెప్పారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కరోనా టీకాలు వంద కోట్లకు చేరుకున్న సందర్భంగా వైద్యులను అభినందించారు.


వైద్య సిబ్బందికి మిఠాయి తినిపిస్తున్న మంత్రి అశ్వత్థనారాయణ

చురుకుగా వితరణ

బెంగళూరు (మల్లేశ్వరం): కర్ణాటకలో 83 శాతం మందికి (4.15 కోట్లు) కొవిడ్‌ నివారణకు ఉపకరించే టీకా మొదటి డోసు పూర్తయిందని, 2.05 కోట్ల మందికి రెండో డోసు అందించామని ఐటీ, బీటీ శాఖ మంత్రి డాక్టర్‌ అశ్వత్థనారాయణ వెల్లడించారు. దేశంలో వంద కోట్ల మందికి టీకా డోసు పూర్తయిన నేపథ్యంలో మల్లేశ్వరం కబడ్డీ మైదానంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యులు, వైద్య సిబ్బందిని ఆయన సత్కరించి మాట్లాడారు. ఆరోగ్య, వైద్య సిబ్బంది, ఆ శాఖల అధికారులు, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, ముఖ్యమంత్రి బొమ్మై తదితరులు శ్రద్ధ తీసుకోవడంతోనే ఇది సాధ్యమైందన్నారు. డిసెంబరు నెలాఖరుకు అందరికీ టీకా వేయించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. పార్టీ నాయకులు ఎం.శంకరప్ప, బి.నారాయణ, మంజునాథ్‌, ఎన్‌.ఆర్‌.రమ్‌, హేమలత సేఠ్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.


హుబ్బళ్ల్లిలో వంద కోట్ల కరోనా టీకాల సంబరం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని