మత్తులోకి వెళ్తే జీవితాలు చిత్తు
eenadu telugu news
Published : 23/10/2021 01:19 IST

మత్తులోకి వెళ్తే జీవితాలు చిత్తు


ప్రసంగిస్తున్న న్యాయమూర్తి సదానంద దొడ్డమని, చిత్రంలో అధికారులు

బళ్లారి, న్యూస్‌టుడే: పటిష్ట భారత నిర్మాణంలో యువకుల పాత్ర కీలకం. ఆదర్శాలతో ఉత్తమ పౌరుడిగా ఎదగాలని బళ్లారి జిల్లా ఒకటో అదనపు న్యాయమూర్తి సదానంద దొడ్డమని విద్యార్థులకు హితవు పలికారు. న్యాయసేవా ప్రాధికార, న్యాయవాదుల సంఘం, పోలీస్‌ శాఖ సంయుక్తంగా స్థానిక వార్డులా పదవీ పూర్వ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని న్యాయమూర్తి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి మన సంప్రదాయాలను మరిచిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాలు, మద్యం, పొగాకు వస్తువులకు బానిసలవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. విద్యార్థులు వాటికి దూరంగా ఉంటూ ఉత్తమ పౌరులుగా దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. 18 ఏళ్ల వయసు దాటాకే చోదక అనుమతి పత్రాలు (డ్రైవింగ్‌ లైసెన్సు) పొందిన అనంతరమే వాహనాలు నడపాలన్నారు. మద్యం తాగి, చరవాణిలో మాట్లాడుతూ వాహనాలను నడపొద్దని హెచ్చరించారు. చట్టాలపై న్యాయవాది గాదిలింగ అవగాహన కల్పించారు. డీఎస్పీ రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ జ్ఞానం ఒకరి సొత్తు కాదు. ప్రతి విద్యార్థిలో ప్రతిభ ఉంటుంది. నిరంతర పఠనంతో జ్ఞానాభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు విక్టరి ఇమ్మాన్యుయల్‌, సి.ఐ. నాగరాజు, అధ్యాపకులు తిమ్మప్ప, సతీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని