వినసొంపు.. విమ్స్‌లో కంపు
eenadu telugu news
Published : 23/10/2021 01:19 IST

వినసొంపు.. విమ్స్‌లో కంపు


లోపల ఉండలేక బయట నిరీక్షిస్తున్న రోగుల సహాయకులు

బళ్లారి, న్యూస్‌టుడే: విమ్స్‌.. ఈ పేరు వినగానే ఆరు జిల్లాలకు ఆశాకిరణంగా కనిపిస్తుంది. అనారోగ్యానికి గురైతే ఉన్నత వైద్యం అందుతుందని, సకల సదుపాయాలు ఉంటాయన్నది అందరి నమ్మకం. ఈ విశ్వాసంతోనే రోజూ వేలాదిమంది ‘చలో బళ్లారి’ అనుకుంటూ వస్తారు. ఆసుపత్రిలో పరిశుభ్రత రోగాలు నయమవడానికి కొంతవరకు దోహదపడుతుంది. రెండు రోజుల్లో ఇక్కడ ‘సీను’ మారింది. విమ్స్‌ ఆసుపత్రిని రోజూ శుభ్రం చేసే ‘డి’ గ్రూపు తాత్కాలిక సిబ్బంది తమ డిమాండ్ల సాధన కోసం విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టడంతో పరిసరాలు అసహ్యకరంగా మారిపోయాయి. ఆసుపత్రిలో వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో వైద్యులు, వైద్య విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో అడుగుపెట్టలేనివిధంగా అపరిశుభ్రత నెలకొంది. మరుగుదొడ్లు, మూత్రవిసర్జన గదుల నుంచి వచ్చే దుర్వాసనతో వార్డుల్లో ఉండలేకపోతున్నారు. ప్రసవాలు, పిల్లలు, సర్జికల్‌, మెడికల్‌, యూరాలాజీ, ఆర్థోపెడిక్‌ తదితర వార్డుల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. విమ్స్‌ ఆవరణలోనూ చెత్త దర్శనమిస్తోంది. అత్యవసరంగా వైద్యం అందించాల్సిన రోగులను వారి సంబంధీకులే స్ట్రెచర్‌, చక్రాల కుర్చీలలో తీసుకెళ్తున్నారు. విమ్స్‌లో వ్యర్థాలను తొలగించడానికి ట్రామా కేర్‌ ఆసుపత్రి నుంచి తాత్కాలిక సిబ్బంది రావడంతో వారిని స్థానిక సిబ్బంది అడ్డుకుని వెనక్కి పంపారు.

పిల్లల వార్డులో వ్యర్థాలు

రెండో రోజూ ఆందోళన

విమ్స్‌ డి గ్రూపు తాత్కాలిక సిబ్బంది 596 మంది రెండో రోజు శుక్రవారం కూడా ఆందోళనలో పాల్గొన్నారు. 15 నుంచి 20 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించడం లేదన్నది వీరి ఆరోపణ. సిబ్బంది ఆందోళన విషయం తెలుసుకున్న బాధ్య సంచాలకుడు డా.గంగాధరగౌడ, కార్మికశాఖాధికారులు అక్కడికి వచ్చి వారితో చర్చించారు. నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తామని, విధులకు వెళ్లాలని కోరినా వారు ససేమిరా అంటూ ఆందోళన కొనసాగించారు.

 

విమ్స్‌ ఆవరణలో ఆందోళనలో పాల్గొన్న తాత్కాలిక సిబ్బంది


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని