ప్రియుడితో కలిసి... భర్తను హతమార్చిన భార్య
logo
Published : 18/06/2021 05:04 IST

ప్రియుడితో కలిసి... భర్తను హతమార్చిన భార్య

నెల తర్వాత వెలుగులోకి ఘటన

మృతుడు అజ్మీర రాము

టేకులపల్లి, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం కట్టుకున్న భర్తను కడతేర్చేదాకా తీసుకొచ్చింది. ప్రియుడి మోజులో పడి భర్తను వద్దనుకొని, తనకున్న ఇద్దరు బిడ్డల భవిష్యత్తును కూడా మరిచిపోయి... మద్యం మత్తులో ప్రియుడితో కలిసి భర్త గొంతు నులిమింది. భర్త శవాన్ని ప్రియుడితో కలిసి గోదారి ఇసుక మేటల్లో పూడ్చి ఏమీ తెలియనట్లుగా ఇంటికి చేరుకుంది. పది రోజుల తర్వాత భర్తను వెదికేందుకు అంటూ ఇద్దరు కుమార్తెలను తీసుకుని ప్రియుడి ఇంటికి చేరుకుంది. ఆమెకు, ప్రియుడికి మధ్య వివాదం చోటుచేసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టేకులపల్లి సీఐ బానోత్‌ రాజు, ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బిల్లుడుతండా పంచాయతీ పానుగోతుతండాకు చెందిన అజ్మీరా రాము(35)కు మూడుతండాకు చెందిన లలితతో పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. మృతుడు రాము, ఆయన భార్య లలిత మేకల వ్యాపారం చేస్తుంటారు. వీరికి ఎర్రుపాలెం మండలం అమ్మవారిగూడేనికి చెందిన కంసాని కృష్ణతో మేకల వ్యాపారం ద్వారా పరిచయమైంది. ఇదికాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం రాముకు తెలియడంతో వివాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో తన భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు కృష్ణతో కలిసి లలిత పన్నాగం పన్నింది. గత నెల 15న లలిత తన అత్తను, పిల్లలను ఈట్యాతండాలోని వారి బంధువుల ఇంటికి పంపించి.. దంపతులిద్దరూ మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ విషయాన్ని లలిత తన ప్రియుడు కృష్ణకు ఫోన్లో తెలిపింది. ముందస్తు ప్రణాళికతో ఉన్న కృష్ణ.... భద్రాచలంలో మేకల వ్యాపారానికి వెళ్దామని... లలితను కూడా తీసుకుని రావాలని రామును ఫోన్‌ ద్వారా కోరాడు. దీంతో దంపతులిద్దరూ బయలుదేరారు. బూర్గంపహాడ్‌ దాటిన తరవాత లలిత, తన భర్త రాముని గోదావరి ఇసుక మేటల్లోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత వీరి వద్దకు కృష్ణ చేరుకొని... ముగ్గురు కలిసి మద్యం తాగారు. రాముకు మద్యం ఎక్కువగా తాగించిన తరవాత... తాడుతో గొంతుకు ఉరి పెట్టి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని బూర్గంపహాడ్‌ మండలం నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం సమీపంలోని గొమ్మూరు ర్యాంప్‌ సమీపంలోని గోదావరి ఇసుకలో పాతిపెట్టారు. అనంతరం లలిత ఏమీ తెలియనట్లుగా ఇంటికి చేరుకుని పది రోజులపాటు ఉంది. అనంతరం కుమార్తెలను తీసుకుని ప్రియుడి దగ్గరకు వెళ్లి అక్కడ కొన్ని రోజులపాటు ఉన్నారు. తర్వాత ఇంటికి చేరుకున్నారు. అయితే, గత నెల 8న మృతుడు తల్లి అజ్మీరా లక్ష్మి తన కుమారుడు రాము, కోడలు లలిత, ఇద్దరు మనవరాళ్లు కనిపించడం లేదని టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నాడు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.


ఘటనాస్థలి వద్ద విచారణ చేస్తున్న టేకులపల్లి సీఐ బానోత్‌ రాజు, ఎస్సై రాజ్‌కుమార్‌

లలిత ఇంటికి చేరుకోవడంతో...

లలిత ఇంటికి చేరుకుందనే విషయం పోలీసులకు సమాచారం అందడంతో పానుగోతుతండా వెళ్లి విచారించారు. దీంతో ఆమె జరిగిన విషయాన్ని పోలీసుల ఎదుట ఒప్పుకుంది. నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు.

గోదావరి ఇసుక మేటల్లో మృతదేహం..

నిందితురాలు ఇచ్చిన సమాచారం మేరకు టేకులపల్లి సీఐ, ఎస్సై... బూర్గంపహాడ్‌ సమీపంలోని ఇసుక మేటల్లో డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ చేయించారు. హత్య చేసి నెలరోజులు గడుస్తుండటంతో రాము అస్థిపంజరం లభ్యమైంది. బూర్గంపహాడ్‌ తహసీల్దార్‌ భగవాన్‌రెడ్డి, గిర్ధావర్‌ అక్బర్‌బాబు పంచనామా చేశారు. ఇక్కడి ఎస్సై సముద్రాల జితేందర్‌ టేకులపల్లి పోలీసులకు సహకరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని