జాగ్రత్తలే మాతాశిశువులకు రక్ష
logo
Published : 20/06/2021 03:41 IST

జాగ్రత్తలే మాతాశిశువులకు రక్ష

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే

కొవిడ్‌ సందేహాలను నివృత్తి చేస్తున్న ప్రసూతి వైద్య నిపుణురాలు మంగళ

గర్భిణులు, బాలింతలు, పాలిచ్చే తల్ల్లులు చాలా మంది ఎలాంటి లక్షణాలు లేకుండానే కొవిడ్‌ పాజిటివ్‌గా నమోదవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ వైద్యుల సలహా మేరకు నడుచుకుంటే సరిపోతుందని ఖమ్మం జిల్లా ఆస్పత్రి మాతాశిశు ఆరోగ్య కేంద్రం ప్రసూతి విభాగం వైద్య నిపుణురాలు డాక్టర్‌ ఎస్‌.మంగళ సూచించారు.. కొవిడ్‌ బారిన పడిన తల్లులు, పిల్లలకు ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉంది. ఇప్పటివరకు 130 మందికి పైగా ఇక్కడ చికిత్స తీసుకుని కోలుకున్నారు. పాజిటివ్‌ లక్షణాలు కలిగిన గర్భిణులకు కూడా కాన్పులు చేస్తున్నామని వివరించారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘ఫోన్‌ ఇన్‌’ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని పలువురు వ్యక్తపరిచిన సందేహాలను వైద్యురాలు నివృత్తి చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

పాజిటివ్‌ వచ్చిన బాలింతలు ఎలాంటి మందులు వాడాలి? వారికి ప్రత్యేకమైన చికిత్స ఏమైనా ఉందా?: రాము

సమాధానం: పాజిటివ్‌ వచ్చిన తల్లులకు ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏమీ ఉండదు. అందరికీ ఒకే రకమైన మాత్రలు ఉంటాయి. ప్రత్యేకమైన సమస్యలు ఉంటే వాటికి అదనంగా మందులు వాడాల్సి ఉంటుంది.

మా కుటుంబంలో అందరికీ పాజిటివ్‌ వచ్చింది. మాకు మూడు నెలల పాప ఉంది. తల్లి పాలు ఇవ్వొచ్చా? సందీప్‌

సమాధానం: అందరూ ఐసోలేషన్‌ పాటిస్తూ వైద్యులు సూచించిన మందులు వాడాలి. పాపకు కూడా పరీక్ష చేయించండి. పాజిటివ్‌ ఉన్నా తల్లి పాలు ఇవ్వొచ్ఛు పాలు ఇచ్చే సమయంలో తల్లి తన ముఖం ఒక పక్కకు ఉంచి రొమ్మును శుభ్రం చేసి పాలు పట్టాలి.

మా సోదరి ఏడు నెలల గర్భిణి. కొవిడ్‌ వచ్చి తగ్గిపోయింది. కరోనా మందులు వాడటం వల్ల కడుపులో బిడ్డపై ఏమైనా ప్రభావం ఉంటుందా?: సరిత

సమాధానం: గర్భిణీగా ఉన్న సమయంలో కొవిడ్‌ వచ్చినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. మందులు వాడటం వల్ల పిల్లలపై ప్రభావం ఉంటుందని శాస్త్రీయంగా ఎక్కడా నిరూపణ కాలేదు. కొవిడ్‌ వచ్చి తగ్గిపోయిన గర్భిణులు మాత్రం నిర్దేశిత నెలలకు ముందే ప్రసవించే అవకాశం కొంత వరకు ఉండవచ్ఛు

కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చి 12 రోజులైంది. నాలుగు నెలల గర్భిణీని. ఏమైనా సమస్య ఉంటుందా? ఎలాంటి వాసన లేదు. ముక్కులు పట్టేస్తున్నాయి. ఏం చేయాలి?: స్రవంతి

సమాధానం: 12 రోజుల తర్వాత ఇతర లక్షణాలు లేనపుడు భయపడాల్సిన పని లేదు. వాసన పోయిందంటే త్వరగా కోలుకునే అవకాశం ఉందని సూచిక. ముక్కులు పట్టేయకుండా వేడి నీళ్లు ఆవిరి పడితే సరిపోతుంది.

గర్భిణులకు సహజంగానే శ్వాస ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వైరస్‌ నివారణ కోసం విధిగా మాస్క్‌ ధరిస్తే ఆక్సిజన్‌ సమస్యలు వచ్చే ప్రమాదం లేదా?: రేవతి

సమాధానం: గర్బిణులు శ్వాస ఎక్కువగా తీసుకోవడం సహజ ప్రక్రియ. ఇదే సమయంలో వ్యాధులు దరిచేరకుండా చూసుకోవాలి. కరోనా వైరస్‌ సోకకుండా బయటకు వెళ్లినపుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాల్సిందే. ఆక్సిజన్‌ సమస్య అనేది ఏమీ ఉండదు.

కొవిడ్‌ సోకిన గర్బిణులు, తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వారిపై వైరస్‌ ప్రభావం ఎంత కాలం ఉంటుంది?: రాజు

సమాధానం: కొవిడ్‌ సోకినా లేకున్నా తల్లులు పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది? గతంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వారు త్వరగానే కోలుకుంటున్నారు. ఇతర సమస్యలు ఉన్నట్లైతే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఎవరైనా క్వారంటైన్‌ సమయం వరకు అప్రమత్తంగా ఉండాల్సిందే.

ప్రసవ సమయంలో పాజిటివ్‌ లక్షణాలు ఉన్న తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రాణాలకు ఏమైనా ప్రమాదం ఉంటుందా?: నవీన్‌

సమాధానం: కాన్పు సమయంలో పాజిటివ్‌ ఉన్న వారు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. అలా అని నిర్లక్ష్యం చేయడం తగదు. వైద్య పరీక్షల్లో నివేదికల ఆధారంగా తగిన వైద్యం అందించాల్సి ఉంటుంది.

మాకు 11 నెలల బాబు ఉన్నాడు. ఇలాంటి సమయంలో తల్లీ పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?: మహేష్‌రెడ్డి

సమాధానం: ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్‌ తేలికపాటి లక్షణాలతోనే వస్తోంది. ఎలాంటి భయాందోళన చెందాల్సిన అమసరం లేదు. వైరస్‌ సోకకుండా అందరితో పాటే జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల చేతులను విధిగా శుభ్రం చేయాలి. తల్లి మాస్క్‌ ధరించి పాలు పట్టాలి.

తల్లులు టీకా తీసుకున్న తర్వాత పిల్లలకు పాలు ఇవ్వొచ్చా? ఏమైనా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందా?: రమేశ్‌

సమాధానం: టీకా స్వీకరించిన తల్లులు ఎలాంటి సందేహాలు లేకుండా పిల్లలకు పాలు ఇవ్వొచ్ఛు తద్వార సమస్యలు అంటూ ప్రత్యేకంగా ఏమీ రావు. వైరస్‌ సోకకుండా తీసుకునే అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రక్రియ కొనసాగించవచ్ఛు

పాజిటివ్‌ అయిన గర్భిణులు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవాలా?: సురేశ్‌

సమాధానం: కొవిడ్‌ సోకిన గర్భిణులు తమ ఆరోగ్యస్థితి ఆధారంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర సమస్యలు ఉన్నా, వైరస్‌ లక్షణాలు తీవ్రంగా కన్పించినా ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. లక్షణాలు లేకున్నా వైరస్‌ ఉందని నిర్ధారణ అయితే వైద్యుల సూచనలు పాటిస్తూ హోంఐసోలేషన్‌లో ఉంటే మేలు.

తల్లికి నెగెటివ్‌... బిడ్డకు పాజిటివ్‌ ఉన్నట్లైతే తల్లిపాలు తాగించవచ్చా?: లక్ష్మీప్రియ

సమాధానం: బిడ్డకు పాజిటివ్‌ ఉన్నా తల్లిపాలు పట్టాలి. తల్లిపాలల్లో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. బిడ్డకు కూడా ఎంతో శ్రేయస్కరం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని