స్వీయ రక్షణతోనే నియంత్రణ
logo
Published : 20/06/2021 03:41 IST

స్వీయ రక్షణతోనే నియంత్రణ

ఖమ్మం సారథినగర్‌, న్యూస్‌టుడే


సినీ నటుడు సుమన్‌

లాక్‌డౌన్‌ పెడితే గాని విపత్తు ఓ కొలిక్కి రావడంలేదు. తర్వాత అయినా స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటేనే మహమ్మారిని దూరం చేయవచ్చని, లేకపోతే మళ్లీ అవే పరిస్థితులు చూస్తామని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ పేర్కొన్నారు. శనివారం ఖమ్మం వచ్చిన సుమన్‌ను ‘న్యూస్‌టుడే’ పలకరించింది. కరోనా పరిస్థితులు, సినిమాలు, మార్షల్‌ ఆర్ట్స్‌ గురించి ఆయన తన అభిప్రాయాలు చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే..

మనం బాగుంటే సమాజం బాగున్నట్లే..

అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలనే సూత్రాన్ని పాటించాల్సిన అవసరం ఉందన్నారు. లాక్‌డౌన్‌ విధిస్తారు అనగానే నిత్యావసర దుకాణాలకంటే మద్యం దుకాణాల ఎదుట బారులు తీరిన విధానం మారాలి. ఆపద వచ్చినప్పుడల్లా సోనూసూద్‌, చిరంజీవి, ఇతర ప్రముఖులు సాయం చేస్తారనుకోవడం తప్ఫు ఇప్పటి వరకు మనం బతికిన తీరు, ఇకపై జీవనం విధానం వేరు అనే రీతిలో భిన్నమైన పరిస్థితులు వచ్చాయి. నిర్లక్ష్యం వీడి భౌతిక దూరం పాటిస్తూ మాస్క్‌ ధరించాలి. కరోనా పూర్తిగా వీడక ముందే పలు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల పాజిటివ్‌ కేసులు పెరిగాయన్నారు.

ఓటీటీ ప్రత్యామ్నాయం

సినీ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. క్రమంగా అన్నీ కోలుకుంటాయి. ధైర్యంగా ముందడుగు వేయడం తప్ప మనకు మరో దారి లేదు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత ఒకవేళ సగం సీట్లతో సినిమా హాళ్లు తెరిచినా ప్రయోజనం ఉండదు. కలెక్షన్లు తగ్గి పంపిణీదార్లు, నిర్మాతలు నష్టపోయే అవకాశమే ఎక్కువ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీ ప్రత్యామ్నాయంగా మారుతోందని చెప్పారు.

సమాజానికి కొవిడ్‌ పాఠాలు

మార్షల్‌ ఆర్ట్స్‌తోనే ఎదిగాను. ఇదే కళను విస్తరిస్తే ఎందరికో ఉపాధి, ఆరోగ్యం ఉంటుందనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరాటే సంస్థలు ఏర్పాటు చేశాం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వందలాది మంది విద్యార్థులు కరాటేలో శిక్షణ పొందుతున్నారు. వందమందికి పైగా మాస్టర్లు శిక్షణను వృత్తిగా మలుచుకున్నారు. ఈ ఏడాది చివరి వరకు కొవిడ్‌ వెంటాడే పరిస్థితులు ఉంటాయనే అంచనాలు ఉన్నందున శిక్షకులు, విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇవే పాఠాలు సమాజంలో అందరికి చెప్పాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని