చర్యలకు ఉపక్రమించిన రెవెన్యూ అధికారులు
logo
Published : 20/06/2021 03:41 IST

చర్యలకు ఉపక్రమించిన రెవెన్యూ అధికారులు


పాములపల్లిలో పట్టాదారులను, అనుభవదారులను సమావేశపరిచి మాట్లాడుతున్న తహసీల్దారు సురేశ్‌కుమార్‌

అశ్వాపురం, న్యూస్‌టుడే: ఈ నెల 19న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘నిర్వాసితులకు సీతమ్మ కష్టాలు’ కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. అదనపు కలెక్టర్‌ ఆదేశాల మేరకు తహసీల్దారు వి.సురేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు శనివారం పాములపల్లి రెవెన్యూ గ్రామం వెళ్లారు. గ్రామం పరిధిలో సీతమ్మ సాగర్‌ కరకట్టలు, వాగుల కరకట్టల కింద 182 మంది రైతులు వారి భూములను కోల్పోతున్న విషయం తెలిసిందే. రైతుల జాబితాలతో అధికారులు ప్రాథమిక ప్రకటనను విడుదల చేశారు. జాబితాలో రైతుల సర్వే నెంబర్లు, కోల్పోతున్న భూమి, పట్టాదారు పాసు పుస్తకాలు అన్నీ సరిగ్గానే ఉన్నా ఎవరి భూముల్లో వారు పట్టాదారులుగా రాకుండా ఒకరి భూముల్లో మరొకరు పట్టాదారులుగా వచ్చారు. త్వరలోనే అవార్డు విచారణ కూడా పూర్తి కానున్న నేపథ్యంలో దీనివల్ల పరిహారం చెల్లింపులో తీవ్ర గందరగోళం, వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీనిపై రెవెన్యూ అధికారులు పరిశీలనను ప్రారంభించారు. మరికొన్ని రోజులపాటు ఈ పరిశీలన కొనసాగనున్నది. తొలిరోజు 50 వరకు అభ్యంతరాలు వెల్లడయ్యాయి. రెవెన్యూ అధికారులు పట్టాదారులను అనుభవదారులను పిలిపించి మాట్లాడారు. ముసాయిదా ప్రకటన రూపకల్పనకు పూనుకున్నారు. ఈ ప్రకటన అనంతరం గ్రామసభలు, రైతులతో ఒప్పందాలు ఉంటాయి. దాంతో అవార్డు విచారణ పూర్తవుతుంది. ఈ క్రమంలో జాబితాలో ప్రస్తుతం పట్టాదారులుగా వచ్చినవారు తమకు ఆ భూమికి సంబంధం లేదని నిరభ్యంతర పత్రాలు రాసి ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. కార్యక్రమంలో సర్పంచి బట్టా సత్యనారాయణ, ఆర్‌ఐ తిరుపతిరావు, వీఆర్వోలు, వీఆర్‌ఏలు, రైతులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని