పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
logo
Published : 20/06/2021 03:41 IST

పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

అశ్వాపురం, భద్రాచలం, న్యూస్‌టుడే

దుమ్ముగూడెం ఆనకట్టపై నుంచి పొంగి పొర్లుతున్న జలాలు

గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దుమ్ముగూడెం ఆనకట్టపై నుంచి గోదావరి శనివారం పొంగి పొర్లుతోంది. మార్చిలో గోదావరి గడ్డుకాలాన్ని ఎదుర్కొన్న విషయం విధితమే. ఆనకట్ట వద్ద అట్టడుగున ఉన్న రాళ్లన్నీ బయటపడ్డాయి. పరివాహకంలోని ఎత్తిపోతల పథకాలకు నీరందక మూలనపడ్డాయి. మంచి అదనులో పొలాలకు నీరందకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. కుమ్మరిగూడెం వద్ద మూడు జిల్లాలకు తాగునీటిని సరఫరా చేసే గోదావరి మిషన్‌ భగీరథ ప్రధాన పంప్‌హౌస్‌కు నీరందని పరిస్థితి. మరోవైపు భారజల ప్లాంటుకు నీరందించే ఇన్‌టేక్‌ వెల్‌కు కూడా నీరందని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మిషన్‌ భగీరథ అధికారులు నాటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. స్పందించిన ప్రభుత్వం ఎగువన ఉన్న ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేసింది. తర్వాత దుమ్ముగూడెం ఆనకట్ట వద్దకు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఆనకట్ట నిండుకుండలా మారింది. అయినా ఆనకట్టపై నుంచి గోదావరి జలాలు పొంగి పొర్లలేదు. ఇప్పటి వరకు అక్కడే నిలిచి ఉన్నాయి. శుక్రవారం వరకు ఈ పరిస్థితి కొనసాగింది.

* ఎగువన మహారాష్ట్రలో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లోకి కూడా ఇన్‌ఫ్లో బాగా పెరగడంతో గోదావరి జలాలను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం దుమ్ముగూడెం ఆనకట్టపై నుంచి అడుగు ఎత్తున గోదావరి పొంగి పొర్లుతోంది. మరోవైపు ఆనకట్టకు దిగువ భాగంలోనే 200 మీటర్ల దూరంలో సీతమ్మ సాగర్‌ పునాది పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న విషయం తెలిసిందే. గోదావరిలో అడ్డుగా ఆనకట్టకు సమాంతరంగా 600 మీటర్ల వరకు యు ఆకారంలో కాపర్‌డ్యాంను నిర్మించి మధ్యలో సీతమ్మసాగర్‌ ప్రాజెక్టు పునాది పనులను చేపడుతున్నారు. కాపర్‌డ్యాం కారణంగా సీతమ్మ సాగర్‌ పునాది పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి.

* భద్రాచలం వద్ద గోదావరికి క్రమంగా వరదొచ్చి చేరడంతో నీటిమట్టం నిదానంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు 4 అడుగుల కన్నా తక్కువ ఉండగా శనివారం సాయంత్రానికి 4.8 అడుగులకు చేరింది. ఇక్కడ ఇది పెద్ద వరద కానప్పటికీ కొన్ని తాత్కాలిక దుకాణాలు మునిగాయి. ఒడ్డుకు సమీపంలో బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో భక్తుల సదుపాయం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక పందిరిలోకి నీళ్లు చేరాయి. ఇది కొట్టుకుపోకుండా ఉండేందుకు ఆ సంఘం నాయకుడు రవికుమార్‌ నేతృత్వంలో పందిరి సామగ్రిని ఒడ్డుకు చేర్చారు. కరకట్టపై నుంచి చూసే వారికి జలకళ ఆహ్లాదాన్ని పంచింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని