రూ. 1.03 కోట్ల గంజాయి పట్టివేత
logo
Published : 20/06/2021 03:41 IST

రూ. 1.03 కోట్ల గంజాయి పట్టివేత

నిందితులు, గంజాయి పొట్లాలతో అదనపు ఎస్పీ కేఆర్కే ప్రసాద్‌రావు, పోలీసు అధికారులు

అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మామిడికాయల ముసుగులో తరలిస్తున్న 6.86 క్వింటాళ్ల గంజాయిని అశ్వారావుపేట పోలీసులు పట్టుకున్నారు. దీనివిలువ సుమారు రూ.1,02,97,500 ఉంటుందని తెలిపారు. పాల్వంచ అదనపు ఎస్పీ కేఆర్కే ప్రసాదరావు శనివారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు దాటిన తర్వాత అశ్వారావుపేటలో కొవిడ్‌ చెక్‌పోస్టు వద్ద శనివారం ఎస్సై రామమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో మామిడికాయల బస్తాలను వేసుకుని ఒక వాహనం వచ్చింది. పోలీసులను చూసి డ్రైవర్‌ కంగారుపడటంతో అనుమానించి సోదా చేశారు. పోలీసులు మామిడికాయల బస్తాల కింద భారీగా గంజాయి పొట్లాలను గుర్తించారు. డ్రైవర్‌ను, ఉత్తర్‌ప్రదేశ్‌ చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్‌ ప్రసాద్‌ సమక్షంలో పంచనామ నిర్వహించారు.

* గంజాయి తరలిస్తున్న మహమ్మద్‌ రాహుల్‌, మహమ్మద్‌ సాల్మన్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం అలీగఢ్‌ జిల్లాకు చెందిన వారని, వాహనం డ్రైవర్‌ కంప రామిరెడ్డి విజయనగరం జిల్లాకు చెందినవాడని తెలిపారు. రాహుల్‌, సాల్మన్‌ రెండు రోజుల క్రితం విశాఖపట్టణం జిల్లా చింతపల్లి మండలం లోతుగుడ్డ గ్రామానికి చెందిన పంగి శివ, పంగి నారాయణరావు వద్ద గంజాయిని కొనుగోలు చేశారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కేలుగుపేటకు చెందిన రామిరెడ్డి వాహనంలో అడుగున 130 గంజాయి ప్యాకెట్లు ఎవరికీ అనుమానం రాకుండా ఉంచి వాటిపై మామిడికాయల బస్తాలను వేసుకుని యూపీకి తరలిస్తుండగా పట్టుబడిందని అదనపు ఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐ ఉపేంద్రరావు, ఎస్సైలు అరుణ, రామమూర్తి, ఏఎస్సై సత్యనారాయణ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని