దృష్టి మళ్లిస్తారు.. సొత్తు కాజేస్తారు
logo
Published : 25/06/2021 04:01 IST

దృష్టి మళ్లిస్తారు.. సొత్తు కాజేస్తారు

కొత్తగూడెంలోని దుకాణంలో ఆభరణాలు మాయం

రెండు గంటల్లోనే కి‘లేడీ’ల ముఠా ఆటకట్టు

వివరాలు వెల్లడిస్తున్న సీఐ వేణుచందర్‌, చిత్రంలో (వెనుక) మహిళల ముఠా

కొత్తగూడెం రామవరం, న్యూస్‌టుడే: కొనుగోలుదారులుగా నటిస్తూ నగలు, వస్త్ర దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న కిలాడీ లేడీల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరు రాష్ట్రవ్యాప్తంగా పలు పట్టణాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గంటల వ్యవధిలోనే ముఠా ఆటకట్టించి ఊచలు లెక్కపెట్టించేలా చేయడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శ్రీనిధి జ్యువెల్లరీస్‌కు మధ్యాహ్నం 2 గంటల సమయంలో అయిదుగురు మహిళలు వచ్చారు. బంగారు ఆభరణాలు చూపాలని నిర్వాహకులను కోరారు. అనంతరం వారిని బురిడీ కొట్టించి సుమారు రూ.60 వేల విలువైన రెండు జతల చెవిదిద్దులను మాయం చేశారు. ఆ తర్వాత ఏమీ కొనుగోలు చేయకుండానే మెల్లగా అక్కడ్నుంచి జారుకున్నారు. దీంతో అనుమానం వచ్చిన దుకాణ నిర్వాహకులు ఆభరణాలను సరిచూసుకోగా రెండు జతల చెవిదిద్దులు లెక్కతేలలేదు. దొంగతనం జరిగినట్లు గుర్తించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించారు. సదరు మహిళల ముఠా కొత్తగూడెం బస్టాండ్‌ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఘటన జరిగిన రెండు గంటల్లో.. సాయంత్రం 4 ప్రాంతంలో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వేలిముద్రల స్కానర్‌ సాయంతో నిందితులు వారేనని తేల్చారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సాయంతో దర్యాప్తు చేయగా కిలేడీల ముఠాపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి 25 కేసులు పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నమోదైనట్లు తేలింది. పట్టుబడిన నిందితురాళ్లలో మహబూబాబాద్‌ జిల్లా మంగమడుగు, నరసింహులుపేట పంచాయతీలోని ఫకీరాతండాకు చెందిన గుగులోత్‌ గోబీ (55), భూక్యా బుల్లి(56), భూక్యా మంగతి(58), భూక్యా అంకు(60), భూక్యా సీత(57) ఉన్నారు. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి వరంగల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి, జనగామ, ఖమ్మం, సిద్ధిపేట జిల్లాల పరిధిలో బంగారు నగలు, వస్త్ర దుకాణాల్లో నిర్వాహకుల దృష్టి మరల్చి సొత్తు కాజేస్తున్నట్లు మూడో పట్టణ సీఐ వేణుచందర్‌ గురువారం విలేకరులకు తెలిపారు. గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ సునీల్‌దత్‌ అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని