యమపాశాలు
eenadu telugu news
Updated : 15/09/2021 05:59 IST

యమపాశాలు

విద్యుదాఘాతంతో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

మహిధర్‌(దాచిన చిత్రం)

టేకులపల్లి, న్యూస్‌టుడే: టేకులపల్లి మండల కేంద్రంలోని సీసీరోడ్‌ వీధిలో వినాయక మండపం వద్ద మంగళవారం విద్యుదాఘాతానికి గురై భూక్య మహిధర్‌(12) అనే బాలుడు మృతిచెందాడు. ఏఎస్సై భూక్య కృష్ణనాయక్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భూక్య రమేశ్‌-భారతి దంపతుల పెద్ద కుమారుడు మహిధర్‌. వీరి నివాస ప్రాంతంలో కొందరు పిల్లలు చిన్న మండపం ఏర్పాటు చేసి గణేశ్‌ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.30గంటల సమయంలో మహిధర్‌, ఇతని తమ్ముడు రాహుల్‌, కొంతమంది చిన్నారులు ఆడుకుంటున్నారు. విగ్రహం పెట్టిన ఇనుపబల్ల కింద మహిధర్‌ దూరి గ్రీన్‌ కార్పెట్‌ను అడ్డుపెట్టుకున్నాడు. మండపానికి విద్యుత్తు సరఫరా చేసే తీగ తెగి విగ్రహం పెట్టిన ఇనుపబల్లకు తాకింది. దీంతో బల్లకింద ఉన్న బాలుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. తోటి పిల్లలు గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చారు. అక్కడే ఉన్న బాలుడి పెదనాన్న రమణ గమనించగా... అప్పటికే మహిధర్‌ ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.


కలుపు తీసేందుకు వెళ్లి..

వెంకటరమణ మృతదేహం

తల్లాడ, న్యూస్‌టుడే: వరిపొలంలో కలుపు తీసేందుకు కూలికి వెళ్లిన ఓ మహిళ విద్యుత్తు తీగ తగిలి అక్కడిక్కడే మృతి చెందింది. మరో నలుగురు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. ఈ ఘటన తల్లాడ మండలం వెంగన్నపేట(గూడూరు)లో మంగళవారం చోటుచేసుకుంది. వెంగన్నపేటకు చెందిన వడ్డె వీరయ్య వరి పొలంలో కలుపు తీసేందుకు బండారు వెంకటరమణ(46)తో పాటు మరో నలుగురు కూలీలు వెళ్లారు. అప్పుడు కరెంటు పోయి ఉంది. కలుపు తీస్తూ నలుగురు పొలంలో పడిఉన్న విద్యుత్తు తీగను దాటి ముందుకు వెళ్లారు. వెనక ఉన్న వెంకటరమణ తీగ దగ్గరకు వచ్చి కలుపుతీసే సమయంలో కరెంటు రావడం, ఆమె తగలడంతో ప్రమాదానికి గురై అక్కడిక్కడే మృతి చెందింది. ప్రమాదాన్ని గమనించిన తోటి మహిళా కూలీలు కేకలు వేస్తూ ఒడ్డుకు పరుగుతీశారు. వైరా సీఐ వసంత్‌కుమార్‌, తల్లాడ ఎస్సై జి.నరేశ్‌ ప్రమాద స్థలానికి చేరుకుని సమాచారం సేకరించారు. వెంకటరమణ వెంగన్నపేట సర్పంచి బండారు ఏడుకొండలు సోదరి. సర్పంచి ఫిర్యాదు మేరకు ఎస్సై నరేశ్‌ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని మధిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంగన్నపేట గ్రామంలో విషాదం అలుముకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని