క్షణ.. క్షణం ఉత్కంఠ
eenadu telugu news
Published : 26/10/2021 02:39 IST

క్షణ.. క్షణం ఉత్కంఠ

రాత్రి పదిగంటలకు ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌ ప్రారంభం

కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న డీఈవో తాహెరా సుల్తానా, అధికారులు

మచిలీపట్నం(చిలకలపూడి),న్యూస్‌టుడే: ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌ ప్రక్రియలో అడుగడుగునా ఉత్కంఠ నెలకొంది. సోమవారం మధ్యాహ్నం జరగాల్సిన ప్రక్రియ ఎట్టకేలకు రాత్రి పదిగంటలకు ప్రారంభమైంది. ఆర్జేడీ కార్యాలయం నుంచి ఆదేశాలు సకాలంలో రాకపోవడమే ఇందుకు కారణం. 55మందితో జిల్లావిద్యాశాఖ నివేదిక పంపడం, 40మందికే అనుమతించడం తెలిసిందే. పక్క జిల్లాల్లో మాదిరిగా కనీసం 50మందికి అయినా అనుమతి ఇవ్వాలని కోరినట్లు ఉపాధ్యాయ సంఘ నాయకులు తెలిపారు. దీనిపై రాత్రి 9గంటల వరకు ఎలాంటి అనుమతులు రాకపోవడంతో ఉపాధ్యాయులు, సంఘ నాయకులు కార్యాలయంలోనే నిరీక్షించారు. ఒకదశలో అసలు కౌన్సెలింగ్‌ జరుగుతుందా లేక వాయిదా వేస్తారా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఎంతో ఆశతో వచ్చిన ఉపాధ్యాయులు ఎంతకూ కౌన్సెలింగ్‌ ప్రారంభం కాకపోవడంతో నిరాశకు గురయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి విద్యాశాఖ ఎంపికచేసిన 40 మందికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని అధికారులు చెప్పడంతో ఆయా ఉపాధ్యాయులు, పలువురు సంఘ నాయకులు ఒంటిగంటకే డీఈవో కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటినుంచి రాత్రి పదిగంటల వరకు కార్యాలయ ప్రాంగణంలోని చెట్ల కింద నిరీక్షిస్తూ అవస్థలు పడ్డారు. జాప్యానికి కారణమేమిటని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పలుసార్లు ఉన్నతాధికారులను అడుగగా ఇదిగో అదిగో అంటూ చెబుతూ వచ్చారు. ముందుగా అనుకున్న ప్రకారం 40 మందికి ఇవ్వాలా లేక జిల్లా విద్యాశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం 55 మందికి ఇవ్వాలా అనే దానిపై ఆర్జేడీ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో జాప్యం జరిగింది.

మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు

పదోన్నతులు 40 మందికే ఇస్తామని చెప్పిన విద్యాశాఖ సాయంత్రం నాలుగున్నర సమయంలో మిగిలిన 15 మందినీ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సమాచారం ఇవ్వడంలో వారంతా వచ్చారు. కైకలూరు, గంపలగూడెం, కలిదిండి తదితర ప్రాంతాల నుంచి ఎంతో ఆశతో అనేక వ్యయప్రయాసలకు గురై వచ్చారు. రాత్రి పదిగంటల సమయంలో 40 మందికి పదోన్నతులు కల్పించాలని ఆర్జేడీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని జిల్లా అధికారులు చెప్పడంతో 15 మంది ఉపాధ్యాయులు నిరాశతో వెనుదిరిగారు. కౌన్సెలింగ్‌ నిర్వహించనప్పుడు తమను హడావిడిగా ఎందుకు రప్పించారని అసహనం వ్యక్తం చేశారు. ప్రక్రియలో డీఈవో తాహెరా సుల్తానా, ఏడీలు గూడూరు శ్రీనివాస్‌, అజీజ్‌, సూపరింటెండెంట్‌ పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు: తాహెరా సుల్తానా, డీఈవో

ఆర్జేడీ కార్యాలయం నుంచి ఆదేశాలు ఆలస్యంగా రావడం వల్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియలో జాప్యం జరిగింది. మిగిలిన 15 మందికి కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని