అలంకారమేనా.. అక్కరకొచ్చేనా !
eenadu telugu news
Published : 26/10/2021 02:39 IST

అలంకారమేనా.. అక్కరకొచ్చేనా !

న్యూస్‌టుడే, కైకలూరు టౌన్‌, కలిదిండి

ఇంగిలిపాకలంకలో ఫిల్టర్‌బెడ్‌లో మొక్కలు ఇలా..

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సు తీర గ్రామాలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. గ్రామాల్లో రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాలు అలంకారప్రాయంగా మారుతున్నాయి. చెరువుల్లో నీటిని శుద్ధి చేయకుండా నేరుగా ట్యాంక్‌ల్లోకి ఎక్కించి కుళాయిలకు విడుదల చేస్తున్నారు. ఫిల్టర్‌బెడ్‌లు పాడైనా వాటి మరమ్మతులపై దృష్టిసారించడం లేదు. దీంతో కొన్ని గ్రామాల్లో ఫిల్టర్‌బెడ్‌లలో మొక్కలు మొలిచి, నాచుపట్టి భయంకరంగా తయారయ్యాయి. కొల్లేరు గ్రామాలతో పాటు కైకలూరు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

కలిదిండి మండలంలో 23 గ్రామ పంచాయతీలకు గాను 22 రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి. ఒక్కోదానికి అనుసంధానంగా రెండు చొప్పున ఫిల్టర్‌బెడ్లు ఉన్నాయి. భాస్కరరావుపేట గ్రామానికి రక్షిత మంచినీటి పథకం మంజూరు కాకపోవడం వల్ల మూలలంక పథకం నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మిగిలిన గ్రామాల్లో 44 ఫిల్టరుబెడ్లకు గాను ప్రస్తుతం 30 మాత్రమే సక్రమంగా పనిచేస్తున్నాయి. మరో 10 బెడ్లు నామమాత్రంగా ఉండగా, మిగిలిన 10చోట్ల మరమ్మతులకు గురయ్యాయి. కోరుకొల్లు, సంతోషపురం, ఆవకూరు, కొచ్చెర్ల తదితర గ్రామాలు ఒక్కొక్కటి చొప్పున ఫిల్టర్‌బెడ్‌తోనే కాలం నెట్టుకొస్తున్నాయి. మండల కేంద్రమైన కలిదిండిలోనూ ఈ సమస్య వేధిస్తోంది. తాగునీరు కలుషితంగా ఉంటుందన్న విమర్శలు అధికంగా ఉన్నాయి. దీనిపై ఇటీవల చెరువులోని నీటిని బయటకు తొలగించి, కొత్తనీటితో చెరువు నింపుతున్నారు.

పాకుడు వాసన వస్తోంది

పంచాయతీ ద్వారా సరఫరా అవుతున్న నీరు పాకుడు వాసన వస్తోంది. చెరువుల్లో భారీఎత్తున ప్లాంటాన్‌ వృద్ధి చెందడంతో రెండు మూడునెలలకే ఫిల్టర్‌బెడ్‌లు పాడవుతున్నాయి. పంచాయతీలు వీటిని పట్టించుకోకుండా వినియోగిస్తుండడంతో రక్షిత మంచినీటి పథకం ద్వారా విడుదలవుతున్న నీరు కనీస అవసరాలకూ వాడుకోలేకపోతున్నాం. ఈ నీటిని తాగేవారు ఆసుపత్రుల పాలవుతున్నారు. - బండి రంగారావు, మండవల్లి

శుద్ధి చేసిన నీటి విడుదలకు చర్యలు

ఇప్పటికే చాలా గ్రామాల్లో పథకాల మరమ్మతునకు చర్యలు చేపట్టాం. డెల్టా శివారు ప్రాంతంలో చేపల చెరువుల వల్ల మంచినీటి చెరువుల్లో నింపే ముందే నీరు కలుషితం అవుతుంది. ట్యాంక్‌ వాచర్లు నీటివిడుదలలో జాగ్రత్తలు పాటించాలి. నీటిని శుద్ధిచేసిన తర్వాత మాత్రమే విడుదల చేయాలి. పెనుమాకలంకలో కొత్త రక్షిత మంచినీటి పథకానికి రూ.80 లక్షలతో అంచనాలు పంపాం.  - కృష్ణారావు, ఏఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌, మండవల్లి

గుక్కెడు నీటికీ కష్టాలే..

కోరుకొల్లులో పసర్లు తేలిన నీరు ●

కొల్లేరు గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు పూర్తిగా పడకేశాయి. ఒక్కో వ్యక్తికి రోజుకు 5 లీటర్ల తాగునీరు, 30 లీటర్ల వాడుక నీరు ఇవ్వాలనే ప్రభుత్వ నిబంధనలు అమలు కావడం లేదు. గుక్కెడు నీటి కోసం ఐదారు కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా ప్రైవేటు ఆర్‌.ఒ. ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసుకోవాల్సిందే. నియోజకవర్గంలోని 110 పంచాయతీల్లో 80 గ్రామాల్లో నీటిని నేరుగా కుళాయిలకు విడుదల చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్ఛు ముఖ్యంగా మండవల్లి మండలం ఇంగిలిపాకలంక, పెనుమాకలంక, నందిగామలంక, తక్కెళ్లపాడు, నుచ్చుమిల్లి, లోకుమూడి, చావలిపాడు, మండవల్లి, ఉనికిలి, కైకలూరు మండలం ఆలపాడు, గోపవరం, పెంచికలమర్రు, చటాకాయ్‌, రాచపట్నం గ్రామాల్లో సమస్య ఎక్కువగా ఉంది.

అమలుకు నోచుకోని ప్రతిపాదనలు

గూడూరులో వినియోగించకుండా వదిలేశారిలా..

గూడూరు: గూడూరు మేజర్‌ పంచాయతీ, ఆపై మండల కేంద్రం. అయినా ఇప్పటికీ ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతూనే ఉన్నారు. ఊళ్లో రక్షితనీటి పథకం, పబ్లిక్‌ కుళాయిలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు రక్షితనీటి పథకానికి అనుసంధానంగా ఉన్న ఫిల్టర్‌బెడ్‌ల ద్వారా నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేవారు. ప్రస్తుతం ముక్కొల్లు సామూహిక రక్షిత నీటి పథకం నుంచి నీటిని విడుదల చేయడంతో ఫిల్టర్‌బెడ్‌లను వినియోగించడం లేదు. దీంతో అవి పిచ్చిమొక్కలతో నిండి అధ్వానంగా తయారయ్యాయి. ప్రస్తుతం సరఫరా అవుతోన్న నీరు పైపులైన్‌ల లీకుల కారణంగా అప్పుడప్పుడు రంగుమారి సరఫరా అవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. జలజీవన్‌ మిషన్‌లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి ఇంటింటికీ తాగునీరు అందించేలా ప్రతిపాదనలు చేసినా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. మండలంలో మరో మేజర్‌ పంచాయతీ అయిన మల్లవోలులోనూ ఇదే పరిస్థితి. బోర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గతంలో మల్లవోలులో రూ.8కోట్లతో సామూహిక రక్షితనీటి పథకం నిర్మించి పరిసర గ్రామాలకు తాగునీరు అందించేందుకు చేసిన ప్రయత్నం ప్రతిపాదనల దశ దాటలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.

పూర్తి కాని మరమ్మతులు

చెన్నూరు రక్షిత మంచినీటి పథకం దుస్థితి

చెన్నూరు (పెడన గ్రామీణం): మండలంలో మేజర్‌ పంచాయితీ చెన్నూరు రక్షిత మంచినీటి పథకం ఫిల్టర్‌బెడ్లు మరమ్మతులకు నోచుకోక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి 1.40 కిలో లీటర్ల సామర్థ్యం ఉన్న రక్షిత పథకం, చెరువు ఉన్నాయి. కొంతకాలంగా ఫిల్టర్‌బెడ్లు మరమ్మతు చేపట్టక పోవటంతో గ్రామస్థులు ఈ నీటిని వాడుక అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. రోజూ నీరు సరఫరా అవుతున్నా గ్రామస్థుల తాగునీటి అవసరాలు తీరడం లేదు. పథకానికి సంబంధించి ఎస్‌-1 ఫిల్టర్‌కు రూ.2.50 లక్షలు, ఎస్‌-2 ఫిల్టర్‌కు రూ.3.50 లక్షల వ్యయంతో మరమ్మతు చేయటానికి ప్రతిపాదనలు సిద్ధమైనా జాప్యం జరుగుతోంది. గ్రామంలో 414 ప్రైవేటు, 18 పబ్లిక్‌ కొళాయిలున్నాయి. పథకానికి మరమ్మతు చేపడతామని గ్రామ కార్యదర్శి సయ్యద్‌ కరీం తెలిపారు. ఫిల్టర్లలో వాడే ఇసుక బాపట్ల, చీరాల నుంచి రావాల్సి ఉందని అది రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని