కానుక..అందక..!
eenadu telugu news
Published : 26/10/2021 02:39 IST

కానుక..అందక..!

బందరు మండలంలో పలు పాఠశాలలకు చెందిన 730మంది విద్యార్థులకు ఇంకా విద్యాకానుక కిట్లు అందలేదు. పాఠశాలలు ప్రారంభించి రోజులు గడుస్తున్నా వాటిని పంపిణీ చేయకపోవడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.

కైకలూరు నియోజకవర్గంలోని కైకలూరు మండలంలో 455 మందికి, .కలిదిండి మండలంలో 321మంది విద్యార్థులకు ఇంత వరకు పంపిణీ చేయలేదు.

బందరు డివిజన్‌లోని బంటుమిల్లి మండలంలో 497, పెడన మండలంలో 260, గూడూరు మండలంలో 200మంది ఇలా జిల్లావ్యాప్తంగా 13 వేలమందికిపైగా విద్యార్థులకు కిట్లు అందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మచిలీపట్నం కార్పొరేషన్‌,న్యూస్‌టుడే : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, సంచులు తదితరాలతో కలిసి విద్యాకానుక కిట్లు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది చైల్డ్‌ ఇన్‌ఫో నివేదిక ప్రకారం ఈ ఏడాది జిల్లాలోని ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు వీటిని అందజేశారు. ఒక్కో కిట్‌లో మూడు జతల ఏకరూపదుస్తులు, ఒకసెట్‌ రాత,పాఠ్యపుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్యూల్‌బ్యాగు ఉన్నాయి. స్కూల్‌ బ్యాగులు మాత్రం 1-3 తరగతులకు ఒక సైజు, 4-6కు ఒకటి, 7-10కి మరొకటి ఇలా మూడు సైజుల్లో విద్యార్థుల వయసునుబట్టి అందిస్తున్నారు. జిల్యావ్యాప్తంగా 3.17లక్షలమందికి విద్యాకానుక అందజేశారు. అయితే ఈ విద్యాసంవత్సరం కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయి. వారందరికీ ఇప్పటివరకు కానుక అందలేదు. గతేడాది కూడా ఇలా చాలామంది విద్యార్థులకు అందిస్తామని చెప్పినా అమలుకాలేదు. మరోవైపు కొందరికి చాలని బూట్లు ఇవ్వడం విద్యార్థుల తల్లిదండ్రులనుంచి ఫిర్యాదులు అందడంతో వాటిని తిరిగి తీసుకుని కొత్తవి ఇస్తామని చెప్పినా ఆచరణకు నోచుకోలేదు. ఈ ఏడాది కూడా అలానే చేస్తారా లేక పంపిణీ చేస్తారా అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

అన్ని మండలాల్లోనూ అంతే..

జిల్లాలో 13వేల మందికిపైగా విద్యార్థులకు ఇంకా విద్యాకానుక కిట్లు అందించాలని అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇతర డివిజన్లతో పోల్చితే కిట్లు అందని వారు విజయవాడ డివిజన్‌లో ఎక్కువగా ఉన్నారు. విజయవాడ అర్బన్‌లో 4,625మంది, విజయవాడ రూరల్లో 1042, పెనమలూరు 836, కంకిపాడు మండలంలో 159మంది చొప్పున విద్యార్థులకు విద్యాకానుక అందాలి. ప్రస్తుతం అందించిన వాటిలో కూడా కొందరికి పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. బ్యాగులు ఇస్తే బూట్లు లేక పోవడం లాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆర్‌జేడీ నిర్వహించిన సమావేశంలో పలువురు ఎంఈవోలు ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానుక పంపిణీలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు సమగ్రశిక్ష ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌ విభాగానికి ఇదే అంశంపై జిల్లా నలుమూలలనుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

త్వరలోనే పంపిణీ చేస్తాం

విద్యార్థులు అందరికీ విద్యాకానుక అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఎంతమందికి అందించాలో నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందించాం. ప్రభుత్వం నుంచి కిట్లు పంపిణీ అవుతున్నాయి. వచ్చిన వెంటనే విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. శాఖాపరంగా కూడా ఆదిశగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - డా.శేఖర్‌, సమగ్రశిక్ష ఏపీసీ

ఇదిగో అంటున్నారు

ఈ విద్యాసంవత్సరం మా పిల్లలతోపాటు మా కుటుంబ సభ్యుల పిల్లలను కూడా ప్రయివేటు స్కూలు నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాం. వారికి ఇంతవరకు విద్యాకానుక కిట్లు అందజేయలేదు. అదేమని ఉపాధ్యాయులను అడిగితే ప్రభుత్వం పంపిణీ చేస్తుంది త్వరలోనే ఇస్తామని అంటున్నారు. త్వరితగతిన ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. - వెంకటేశ్వరరావు, విద్యార్థి తండ్రి, గూడూరు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని