నూరు శాతం వ్యాక్సినేషనే లక్ష్యం
eenadu telugu news
Published : 26/10/2021 02:39 IST

నూరు శాతం వ్యాక్సినేషనే లక్ష్యం

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ నివాస్‌, ఇతర అధికారులు

కలెక్టరేట్‌ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: జిల్లాలో నూరు శాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ లక్ష్యం పూర్తి చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులకు స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 45-60 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి దాదాపు నూరు శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందన్నారు. 18-44 సంవత్సరాల వయస్సు ఉన్న వారిలో 67 శాతం మంది మాత్రమే టీకా వేయించుకున్నారని, మిగిలిన వారికి కూడా వేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. శాశ్వత భూహక్కు సర్వేపై ఆరా తీస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని మండల ప్రత్యేక అధికారులకు చెప్పారు. కలెక్టర్‌తో పాటు జేసీలు మాధవీలత, మోహన్‌కుమార్‌, డీఆర్వో వెంకటేశ్వర్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

కొవిడ్‌ సమయంలో విధులు నిర్వహించిన నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, హెల్త్‌ అసిస్టెంట్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లు, తదితర ఉద్యోగులను ఆరు నెలల వ్యవధిలో తొలగించారని, తమ ఉద్యోగాలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని నాగరాజు, గోపీికృష్ణ, తదితరులు విజ్ఞప్తి చేశారు. ● రూ.20వేల లోపు డిపాజిట్లు ఉన్న అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆగస్టు 25న నగదు జమచేశారని, చిన్నాపురం, గుండుపాలెం, గిలకలదిండి, కప్పలదొడ్డి, తదితర గ్రామాల పరిధిలోని కొంతమందికి నగదు జమకాలేదని, పరిశీలించి తగు న్యాయం చేయాలని బాధితులు అర్జీ అందజేశారు. ● రొయ్యూరు, తోట్లవల్లూరు మండలాల పరిధిలో ఇసుక క్వారీలపై ఆధారపడి జీవనం సాగించే దాదాపు 5,000 మంది ఉపాధి కోల్పోయారని, వారికి పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని శివశంకరరావు, వ్యవసాయకార్మిక సంఘ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ● న్యాయస్థానం ద్వారా జగ్గయ్యపేట పోలీస్‌ స్టేషన్‌లో 420 కేసు నమోదైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్థుడు రామారావు ఫిర్యాదు చేశారు.● చందర్లపాడు గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఎం.శ్రీనివాసరావు వికలాంగ పింఛను నిమిత్తం అవసరమైన ఏడో తరగతి మార్కుల జాబితా తాను చదివిన స్కూల్‌లో లేదని చెబుతున్నారని, ఇప్పించాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని