close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

తాజా వార్తలు

నిబంధనలు తూచ్‌

● కల్లూరు తహసీల్దారు కార్యాలయంపై అనిశా ఆకస్మిక దాడి

● ఉద్యోగుల వద్ద రూ.15,480 లభ్యం

● విధుల్లో ప్రైవేటు ఉద్యోగులు ● రిజిస్టర్ల ఊసే లేదు


కార్యాలయానికి విచ్చేసిన మహిళను విచారిస్తున్న సీఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి

కర్నూలు నేరవిభాగం, కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కల్లూరు తహసీల్దారు కార్యాలయాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని తహసీల్దారు కార్యాలయాలపై అనిశా అధికారులు దాడులు జరిపారు. దీనిలో భాగంగా సీఐ తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి తమ సిబ్బందితో కలిసి కార్యాలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో తహసీల్దారు రవికుమార్‌ కార్యాలయంలోనే ఉన్నారు. అనిశా అధికారులు వెళ్లి లోపలున్న వారిని బయటకు, బయట ఉన్నవారిని లోనికి వెళ్లకుండా కట్టడి చేశారు. ఉద్యోగులందరినీ సోదా చేయగా ఐదుగురు ఉద్యోగులు, ఐదుగురు వీఆర్వోలు, వీఆర్‌ఏల వద్ద రూ.15,480 లభించింది. నగదు విషయంలో 10 మందిని విచారించారు. 106 పాసు పస్తకాలు పంపిణీ చేయకుండా ఉంచిన ఉద్దేశాన్ని అడిగి తెలుసుకున్నారు. దస్త్రాలు, కంప్యూటర్లను నిశితంగా పరిశీలించారు. కార్యాలయానికి వచ్చిన వారి అవసరాలు తెలుసుకొని ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారు.. ఎంతకాలం నుంచి తిరుగుతున్నారు.. ఉద్యోగుల సేవలు ఎలా ఉన్నాయి తదితర వివరాలను ఆరా తీశారు. సేవల విషయంలో బాగా జాప్యం జరుగుతోందని పలువురు వాపోయారు.

కార్యాలయ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. వాటిలో కొన్ని..

● మీసేవ దరఖాస్తుల రిజిస్టరు లేదు.

● పంపిణీ చేయని 106 ఈ-పట్టా పాసుపుస్తకాలు ఉప తహసీల్దారు బీరువాలో దొరికాయి.

● హాజరుపట్టిక నిర్వహణ లేదు. బయటకు వెళ్లి వచ్చే సమయాలు నమోదు చేసే రిజిస్టరు లేదు.

● ఉద్యోగులు వ్యక్తిగత డబ్బు ఉంచుకున్న వివరాలను నమోదు చేసే రిజిస్టరు లేదు.

● స్పందన రిజిస్టర్‌, ఖజానా శాఖ బిల్లుల రిజిస్ట్రర్‌ కానరాలేదు.

● అసైన్డ్‌ల్యాండ్‌ రిజిస్టర్‌ నిర్వహణ అధ్వానం.

ఆయుధ అనుమతులకు సంబంధించిన రిజిస్టరు నిర్వహణ సరిగా లేదు.

నెలకు రూ.10 వేలు జీతం తీసుకుంటూ పనిచేస్తున్న సతీష్‌, యు.రంగస్వామి అనే ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులను గుర్తించారు.

2019, జూన్‌ 6 నుంచి ఇప్పటివరకు మీసేవ కేంద్రాల నుంచి 34,302 దరఖాస్తులు అందగా 6,180 దరఖాస్తులను తిరస్కరించారు. పౌరసేవా పట్టిక ప్రాతిపదికన కాలపరిమితి ముగిసి అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులు 329, గడువు ఉండి పూర్తి చేయాల్సిన దరఖాస్తులు 809 వరకు ఉన్నాయి.

తహసీల్దారు డిజిటల్‌ కీ ప్రైవేటు కంప్యూటర్‌ ఆపరేటర్‌ వద్ద ఉండటాన్ని గుర్తించారు. కార్యాలయ నిర్వహణ, పనితీరు, ప్రజాభిప్రాయం వంటి అంశాలతో కూడిన నివేదికను ఆ శాఖ విభాగాధిపతి సీతారామాంజనేయులుకు పంపారు. లభ్యమైన నగదు రూ.15,480 అనధికార నగదుగా పరిగణిస్తారా? లేదా? అన్నది ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు. కాగా శుక్రవారం ఉదయం మొదలైన తనిఖీ రాత్రి వరకు కొనసాగింది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.