రెండు నెలల్లో వివాహం ఉండగా..
logo
Published : 05/07/2020 02:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండు నెలల్లో వివాహం ఉండగా..

జుబేదా

శిరువెళ్ల, న్యూస్‌టుడే: మరో రెండు నెలల్లో వివాహం కావాల్సిన యువతి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన శిరువెళ్ల మండలంలోని బోయలకుంట్లలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జుబేదా(19)కు రెండు నెలల్లో వివాహం కావాల్సి ఉంది. ‘నీ వివాహం కోసం ఉంటున్న ఇల్లు అమ్మాల్సి వస్తుందని, నువ్వు చనిపోతే ఇల్లు మాకే వస్తుందని’ ముంతాజ్‌ (అన్న భార్య), జరీనా, మదార్‌వలి, నన్నెసా (వదిన కుటుంబీకులు) పదే పదే వేధించారు. దీంతో మనస్తాపానికి గురైన జుబేదా శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లో పంకాకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి షేక్‌ చింతకుంట్ల నబీసా ఫిర్యాదు మేరకు కుమార్తె మృతికి కారణమైన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు శనివారం ఎస్సై తెలిపారు.

బావిలో దూకిన గృహిణి..

సంజామల, న్యూస్‌టుడే : కుటుంబ కలహాలతో బావిలో దూకి గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆల్వకొండ గ్రామంలో శనివారం జరిగింది. డమాల ప్రసాదు భార్య లలిత (37) వ్యవసాయంతోపాటు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి కల్పన, మణి సంతానం. ఇటీవల భార్యాభర్తల మధ్య కలహాలు అధికమయ్యాయి. జీవితంపై విరక్తి చెందిన ఆమె గ్రామం వెలుపల ఉన్న బావిలో దూకారు. బర్రెల కాపరులు గుర్తించగా నీటిని బయటకు తోడి శవాన్ని బయటకు తీశారు.

జీవితంపై విరక్తితో..

తుగ్గలి, న్యూస్‌టుడే: అనారోగ్యానికి తోడు ఆర్థిక ఇబ్బందులతో గిరిగెట్ల గ్రామానికి చెందిన బసవరాజు (45) శనివారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తుగ్గలి పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించారన్నారు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఉరేసుకొని ఆత్మహత్య

మునగాల(గూడూరు), న్యూస్‌టుడే: గూడూరు మండలం మునగాల గ్రామానికి చెందిన వల్ల వరలక్ష్మి (24) అనే వివాహిత ఉరివేసుకొని అత్మహత్యకు పాల్పడింది. గతంలో ఇంటిపై నుంచి కిందపడగా మతిస్థిమితం సరిగా లేదని, భర్త టైలరుగా జీవనం కొనసాగిస్తున్నారన్నారు. వీరికి ఒక కూతురు ఉంది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై నాగార్జున సంఘటనా స్థలం పరిశీలించి మృతదేహాన్ని కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి శవపరీక్షకు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని