
నిర్లక్ష్యం చేస్తే సహించం
- ఎస్ఎస్ఏ ఏపీడీ వేణుగోపాల్
పనులు పరిశీలిస్తున్న ఎస్ఎస్ఏ అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్
ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ‘నాడు నేడు పనులలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, నాణ్యతతో పనులు చేసి త్వరగా ముగించాలని ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అడిషనల్ డైరెక్టర్ వేణుగోపాల్ అన్నారు. మాచాని సోమప్ప బాలికోన్నత పాఠశాలలో జరుగుతున్న పనులను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడే విద్యార్థుల సంఖ్య చూసి ఆవరణలో పచ్చదనం, ఇతర వివరాలు తనిఖీ చేశారు. అనంతరం నీలకంఠేశ్వర స్వామి ఉన్నత పాఠశాలలో పనులను ఆరా తీశారు. అసంపూర్తి మరుగుదొడ్లు, మైదానం, ఇతర పనులను వేగవంతం చేయాలని సూచించారు. జగనన్న విద్యా కానుక కిట్లు ప్రతి ఒక్కరికీ పంపిణీ చేశారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశించిన ప్రతి పనినీ పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో దాదాపు తాగునీరు, మరుగుదొడ్లు, బండపరుపు పనులు పూర్తి చేశారని వివరించారు. కొన్నింటిలో పనులు అసంపూర్తిగా ఉండగా, వేగవంతం చేయించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రధానోపాధ్యాయులు మధుసూదన్‌రాజు, గౌసియాబేగం, తదితరులు పాల్గొన్నారు.