Published : 03/12/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కూలికి వెళ్తూ.. మృత్యుఒడికి!

 ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం

● మృతుల్లో అన్న, ఇద్దరు చెల్లెళ్లు

కూలి పనులు వెళ్లే దారి వారి పాలిట మృత్యు మార్గంగా మారింది. హాయిగా సాగుతున్న ప్రయాణంలో ట్రాక్టర్‌ మృత్యుశకటమై దూసుకొచ్చి ప్రాణాలు తీసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని బలిగొన్న ఈ ప్రమాదం బుధవారం గూడూరు పట్టణం సమీపంలోని దాల్‌మిల్‌ వద్ద చోటు చేసుకుంది. అన్నాచెల్లెళ్లు ఒకేసారి ప్రాణాలు పోగొట్టుకున్న ఈ దుర్ఘటన గ్రామంలో విషాదం నింపింది.

న్యూస్‌టుడే, గూడూరు, సి.బెళగల్‌ గ్రామీణం: సి.బెళగల్‌ మండలం బ్రాహ్మణదొడ్డి గ్రామానికి చెందిన బాలకృష్ణ(28), అతని చెల్లెలు గజ్జెలమ్మ(24), వారి చిన్నాన్న కుమార్తె జానకమ్మ(19) కర్నూలు మండలం రేమట గ్రామానికి పత్తి తీసేందకు కూలీ పనికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న ట్రాక్టరు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు. బాలకృష్ణ సి.బెళగల్‌ మండలం బ్రాహ్మణదొడ్డికి చెందిన కుక్కల తిమ్మన్న, మాదమ్మల రెండో కుమారుడు. బాలకృష్ణకు భార్య రామలింగమ్మ, కుమార్తెలు ఇందు, వైశాలి, కుమారుడు వరుణ్‌తేజ ఉన్నారు. తండ్రి ఇక తిరిగిరాడని తెలుసుకున్న చిన్నారులు హృదయవిదారకంగా రోదిస్తున్న తీరు అందర్నీ కలచివేసింది.

ఆర్నెళ్ల క్రితమే వివాహం..

గజ్జెలమ్మకు ఆరు నెలల క్రితమే ఎర్రగుడి గ్రామానికి చెందిన ఈశ్వర్‌తో వివాహమైంది. తల్లిదండ్రులను చూడటానికి ఇటీవల పుట్టింటికి వచ్చింది. పత్తి పనుల కోసం అన్నతో పాటు వెళ్లిన ఆమెను మృత్యువు కబళించింది.

పెళ్లి వేడుక ఆగి.. విషాదంగా మారి!

కుక్కల తిమ్మన్న సోదరుడు దస్తగిరి, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. జానకమ్మ పెద్ద కుమార్తె. ఆమెకు ఇటీవలే కర్నూలు మండలం రేమట గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహ నిశ్చితార్థం జరిగింది. వచ్చే ఎండాకాలంలో వివాహం జరిపించాలని అనుకోగా, బుధవారం జరిగిన ఈ ఘటన వారి కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఐదు గంటలపాటు బైఠాయింపు

ముగ్గురు వ్యక్తులను పొట్టన పెట్టుకున్న ట్రాక్టరు చోదకుణ్ని పట్టుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుపై బైఠాయించి దాదాపుగా ఐదు గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేసి నిందితుణ్ని పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. డీఎస్పీ కేవీ మహేష్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు గూడూరు మండలం వై.కానాపురం గ్రామానికి చెందిన ఉప్పరి మద్దిలేటిగా గుర్తించామన్నారు. చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ముగ్గుర్నీ ట్రాక్టరు ఢీకొట్టినట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించినట్లు కోడుమూరు సీఐ పార్థసారథిరెడ్డి తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగార్జున పేర్కొన్నారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం కోడుమూరు ఆస్పత్రికి తరలించారు.

ట్రాక్టరులో మృతదేహాలు

​​​​​​​


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని