Published : 03/12/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్మార్ట్‌గా సాగుదాం

● రైతుల సమస్యలకు ఇంజినీరింగ్‌ విద్యార్థుల పరిష్కారం

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: రైతు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన ఆర్జీఎం ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు. వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని సూచించారు. పొలంలో జరిగే పలు విషయాలను క్షుణ్నంగా అధ్యయనం చేసి చరవాణికి సమాచారాన్ని చేరవేస్తూ సహాయకారిగా ఉపయోగపడే పరికరాన్ని తీసుకొచ్చారు. పొలంలో తేమ శాతం, ఎంత వరకు మొక్కలకు నీరందుతుంది, ఎంత నీరు పారింది. భూమిలోని సూక్ష్మపోషకాల వివరాలు, పంటకు రక్షణ తదితర వివరాలను చరవాణి ద్వారా తెలుసుకునే పద్ధతిని కనుగొని దానికి ‘స్మార్ట్‌ ఇరిగేషన్‌’ అని పేరు పెట్టారు. ఆర్జీఎం ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్న పాటిల్‌సాయి అభిన్‌, సాయికిరణ్‌ యాదవ్‌, చరిష్మా, త్రివిక్రమ్‌, రాకేశ్‌, నసీహా నౌసీన్‌ బృందం, అధ్యాపకులు గోపికృష్ణారావు, వెంకటకృష్ణ ఆధ్వర్యంలో 5నెలలు శ్రమించి పరికరాన్ని కనుగొన్నారు.

●*పరికరాన్ని తయారు చేసేందుకు ఫైబర్‌ గ్రేటింగ్‌ కేబుల్‌, మైక్రో కంట్రోలర్‌, యాంటినా, తదితర వస్తువులను ఉపయోగించారు. ఫైబర్‌ గ్రేటింగ్‌ కేబుల్‌ను పొలంలో అన్ని దిక్కులు సరిపోయేటట్లు పొలం ఆకారాన్ని బట్టీ స్టార్‌, ప్లస్‌, తదితర పద్ధతుల్లో అమర్చాలి. ఫైబర్‌ కేబుల్‌ ద్వారా పొలం మధ్యలో ఏర్పాటు చేసిన యాంటినాకు పొలంలో జరుగుతున్న విషయాలను ఇది చేరవేస్తుంది. యాంటినా నుంచి వైర్‌లెస్‌ సిగ్నల్స్‌ ద్వారా మైక్రో కంట్రోలర్‌కు అందిస్తాయి. అక్కడి నుంచి చరవాణికి సమాచారం చేరుతుంది.

ఉపయోగాలు

వ్యవసాయ విధానంలో ప్రస్తుతం పంట పైభాగంలో మాత్రమే నీటిని అందిస్తున్నారు. దీంతో మొక్క కింది భాగం వరకు నీరు అందుతుందో లేదో రైతులకు తెలియడం లేదు. లేదా అవసరమైన వాటి కంటే ఎక్కువ నీటిని అందించాల్సి వస్తుంది. దీంతో కొన్ని సమయాల్లో అందాల్సిన నీరు అందకపోగా మరో వైపు నీరు వృథా అవుతుంది. ఈ నూతన విధానం ద్వారా సక్రమంగా అందించి నీటి వృథాను అరికట్టవచ్ఛు నీరు మొక్క మొదళ్లకు చేరగానే సెన్సార్‌ కేబుల్‌ సిగ్నల్‌ ద్వారా పొలం మధ్యలో ఉన్న యాంటినాకు చేరవేస్తుంది. అక్కడున్న సిస్టమ్‌ రైతుకు నీరు చేరిందని మెసేజ్‌ పంపుతుంది. రైతు తన మొబైల్‌ ద్వారా మోటార్‌ను ఆఫ్‌ చేయవచ్చు లేదా నీటి దిశను మార్చవచ్ఛు ఈ విధంగా నీటి వాడకాన్ని పరిశీలించవచ్ఛు

●*●ప్రస్తుత వ్యవసాయ విధానంలో ఎరువుల వినియోగం ముఖ్యమైంది. ఈ పద్ధతి ద్వారా భూమిలో సూక్ష్మకణాలు, పోషక విలువల అవసరాన్ని తెలుసుకోవచ్ఛు

●*అధిక ఎరువుల వినియోగాన్ని నివారించి మొక్కకు సక్రమంగా ఎరువులు అందేలా చూడవచ్ఛు. పొలంలోకి ఎవరైన వచ్చి వెళ్లినా, రాత్రి సమయాల్లో ఇతర జంతువులు తిరిగిన సెన్సార్‌ కేబుల్‌ పీడన మార్పులను పసిగట్టి సమాచారం చరవాణికి చేరడంతో పంటలను రక్షించుకోవడానికి అవకాశం చూపిస్తుంది.

ప్రాజెక్టుకు ప్రత్యేక గుర్తింపు

ఈ ప్రాజెక్టు ద్వారా రైతు తన ఫోన్‌ ద్వారా తన పంటను పండించవచ్చు, రక్షించుకోవచ్ఛు యువ ఇంజినీర్లను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో దేశానికి ఉపయోగపడే ఆలోచనలు, పరిశోధనలను కేంద్రప్రభుత్వం స్వీకరించే కార్యక్రమంలో భాగంగా ఏఐసీటీఈ ఆధ్వర్యంలో చేపడుతున్న స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ కార్యక్రమంలో ఈ ప్రాజెక్టు ఫైనల్‌కు చేరుకుంది. రైతుల సమస్యలకు పరిష్కారాన్ని చూపేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టామని అధ్యాపకుడు గోపికృష్ణారావు తెలిపారు. బిహార్‌ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు విషయాలను వివరించామన్నారు. బిహార్‌ తరుపున ఫైనల్‌కు ఎంపికైన 5 ప్రాజెక్టుల్లో స్మార్ట్‌ వ్యవసాయం కూడా ఉందని వివరించారు.

సాంకేతికతను రైతులకు అందించాలి

మాది అనంతపురం జిల్లా. అక్కడ నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. ఉన్న వనరులను సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ చేసేవాణ్ని. సాంకేతికతను రైతులకు అందించగలిగితే రైతేరాజు అవుతారు. అధ్యాపకులతో సలహాలతో స్ఫూర్తి పొంది ఈ పరికరాన్ని తయారు చేశాం. ఇది అన్నదాతలకు ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా రైతుల కష్టాలు కొంతైన తీరుతాయనుకుంటున్నా.. - పాటిల్‌సాయి అభిన్‌, ఈసీఈ తృతీయ సంవత్సరం

పరికరాన్ని తయారు చేసిన విద్యార్థులు

​​​​​​​
తయారు చేసిన పరికరం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని