
9 నుంచి కొండవీడు ఎక్స్‌ప్రెస్
నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: ఈ నెల 9 నుంచి మచిలీపట్నం-యశ్వంతపూర్ల మధ్య వారానికి మూడు రోజులపాటు కొండవీడు ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు నడిపేందుకు రైల్వే అధికారులు నిర్ణయించారు. సికింద్రాబాద్‌లోని జోనల్ కార్యాలయం నుంచి ఈమేరకు ఉత్తర్వులు వెలువడినట్లు నంద్యాల రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 07211 నంబరు గల ఎక్స్‌ప్రెస్ రైలు బుధ, శని, సోమవారాల్లో మచిలీపట్నం నుంచి 15:50 గంటలకు బయలుదేరి విజయవాడ, గుంటూరు, నంద్యాల, డోన్, అనంతపురం మీదుగా మరుసటి రోజు ఉదయం యశ్వంతపూర్ చేరుకుంటుందని తెలిపారు. ఈ రైలు నంద్యాలకు రాత్రి 23:15 గంటలకు చేరుకుని 23:20 గంటలకు బయలుదేరుతున్నట్లు చెప్పారు. ఇదే రైలు యశ్వంతపూర్ నుంచి అదే మార్గంలో గురు, శని, మంగళవారాల్లో బయలుదేరి మచిలీపట్నం చేరుకుంటుందన్నారు. ఈ రైలు నంద్యాలకు రాత్రి 22:40 గంటలకు వచ్చి 22:45 గంటలకు బయలుదేరుతున్నట్లు తెలిపారు. ఈ సదుపాయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లా కారాగారానికి నంద్యాల సీఐ, కానిస్టేబుల్
కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య కేసులో నిందితులైన నంద్యాల సీఐ సోమశేఖర్, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌లకు అదనపు జిల్లా కోర్టు బెయిల్ రద్దు చేసిన నేపథ్యంలో వీరిని నంద్యాల రెండో పట్టణ పోలీసుస్టేషన్ సీఐ కంబగిరిరాముడు బుధవారం సాయంత్రం కర్నూలుకు తీసుకువచ్చారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వీరికి కరోనాతోపాటు ఇతర ఆరోగ్య పరీక్షలు చేయించారు. ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారణ చేశారు. అనంతరం రాత్రి వీరిని కర్నూలు మండలం పంచలింగాల పరిధిలోని జిల్లా కారాగారానికి తరలించారు. ఆసుపత్రిలో సీఐ, హెడ్‌కానిస్టేబుళ్లు మీడియా కంటపడకుండా చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు.