Published : 03/12/2020 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇసుకో.. రామచంద్రా!

● నిలిచిన భవన నిర్మాణ పనులు

● డిపోల్లోనూ నిల్వల్లేక నల్లబజారు వైపు పరుగులు

ఈర్లదిన్నె వద్ద పడవలో తీసుకొస్తున్న ఇసుక

ఇసుక తుపాను లక్షల కుటుంబాల్లో ఆకలిని మిగుల్చుతోంది. చిన్న గూడు నుంచి భారీ భవనాల వరకు మొండి గోడలతో వెక్కిరిస్తున్నాయి. ఇటుక పేర్చుదామంటే ఇసుక దొరక్క నిలువుగాళ్లపై నిలిచి.. నిలిచీ.. కాళ్లవాపులు.. ఎదురుచూపులతో కళ్లు కాయలు కాస్తున్నాయి. ‘తన చావుకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని ఇసుక కొరతతో వైకాపా నాయకుడు ఓర్వకల్లులో ఇటీవల సెల్‌టవర్‌ ఎక్కగా.. కృష్ణా జిల్లాలో ఏకంగా మంత్రిపైనే హత్యాయత్నానికి పాల్పడ్డాడు మరో వ్యక్తి. ఏళ్ల తరబడి సరైన విధానం అమలుకాక.. ఇసుక కష్టాలు తీరక సామాన్యుల నుంచి సంపన్నుల వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు: ఇసుక కొరత జిల్లాలో తీవ్రమైంది. ఎదురుచూపులతో వినియోగదారులకు సహనం నశించింది. నల్లబజారులో కొనలేక, నిర్మాణాలు పూర్తికావేమోనని సామాన్యులు కలత చెందుతున్నారు. కొత్త విధానం అమలయ్యేలోగా ఆవేదనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితి నెలకొంది. జిల్లాలో తొమ్మిది ఇసుక డిపోలు ఉండగా, ఇందులో బనగానపల్లి, పాణ్యం, ఆళ్లగడ్డ డిపోల్లో ఇసుక నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. మరోవైపు కడప, అనంతపురం జిల్లాల నుంచి ఇసుక సరఫరా నిలిపి వేశారు. జిల్లాలో కేవలం సి.బెళగల్‌ మండల పరిధిలోని ఈర్లదిన్నె, ముడుమాల, పల్దొడ్డి-1, 2 రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను యంత్రాల ద్వారా అరకొరగా సేకరిస్తున్నారు. గుండ్రేవుల, కొండాపురం తుంగభద్ర నదిలో ప్రవాహం ఉండటంతో రీచ్‌లు నిలిపివేశారు. ప్రస్తుతం జిల్లాకు రోజూ మూడు వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక అవసరం ఉంది.

నల్లబజారులో పెరిగిన డిమాండ్‌

ఇసుక డిపోల్లో నిల్వల్లేకపోవడంతో నల్లబజారులో దొరికే ఇసుకకు డిమాండ్‌ మరింత పెరిగింది. కట్టుబడికి ఉపయోగించే ట్రాక్టరు ఇసుక బ్లాక్‌లో రూ.9 వేల నుంచి రూ.10 వేలు, ప్లాస్టింగ్‌ ఇసుక రూ.15 వేలు పలుకుతుంది. డంపర్‌కు రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారు. కర్నూలులో ట్రాక్టర్లలో ఇసుక తరలింపు నిలిచిపోవడంతో బ్లాక్‌లో డిమాండ్‌ పెరిగింది. 25 గంపలున్న ఎద్దుల బండి ఇసుక దూరాన్ని బట్టి రూ.2 వేల వరకు తీసుకుంటున్నారు. ఆటోల్లో మూడు గంపల బరువున్న ఇసుక బస్తాలు 40 ఇచ్చి రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. నదిలో అక్రమ తవ్వకాలతో ఇసుక మాఫియా జేబులు నింపుకొంటోంది. అభివృద్ధి పనులకు ఇసుక పేరుతో గుత్తేదార్లు అర్ధరాత్రి దాటిన తర్వాత వెంచర్లకు అమ్ముకుంటున్నారు. ఇసుక లభించక 1.28 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు పనులు దొరక్క అల్లాడుతున్నారు.

కొత్త విధానం వచ్చేలోగా..

కొత్త విధానం అమలులోకి వచ్చేలోగా ఇసుక డిపోల్లోని నిల్వలను ఖాళీ చేయాలని ఏపీఎండీసీ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చి ఆలోపు వినియోగదారులు ఇబ్బందులు పడకుండా చూడాలని తెలిపింది. ఇవి ఆదేశాలకే పరిమితమయ్యాయి. ఇసుక బుకింగ్‌ చేసుకున్నా, చేరడానికి రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఆన్‌లైన్లో నిల్వల సమాచారమే అందుబాటులో ఉంచని పరిస్థితి నెలకొంది.

లభ్యత లేదు...

తుంగభద్ర తీరంలో ఈర్లదిన్నె, ముడుమాల, పల్దొడ్డి గ్రామాల వద్ద ఇసుకను యంత్రాల ద్వారా సేకరిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనుల పేరుతో ఇసుక తరలించి అవసరార్థులకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సామాన్యులు ఆన్‌లైన్‌లో ఇసుకను బుక్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తే లభ్యత లేదని చూపుతోంది. రీచుల్లో అధికారుల తనిఖీలు లేకపోవడమూ ఇందుకు కారణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాణ్యం డంపింగ్‌ యార్డ్‌కు జిల్లాలోని ముడుమాల రీచ్‌ నుంచి ప్రతి రోజు 15 నుంచి 20 లారీల్లో ఇసుకను తీసుకొస్తున్నారు. రెండు నెలల నుంచి పాణ్యం డంపింగ్‌ యార్డ్‌లో ఇసుక కష్టాలు తీవ్రంగా మారాయి. ఆన్‌లైన్‌లో స్లాట్‌ చూపకపోవడంతో ప్రజలు డంపింగ్‌ యార్డ్‌ చుట్టూ తిరుగుతున్నారు. డంపింగ్‌యార్డ్‌లో లభ్యత ఉన్నా ఆన్‌లైన్‌లో చూపకపోవడంపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆదోని డివిజన్‌లో..

ఎమ్మిగనూరు, మంత్రాలయం, మద్దికెర, ఆదోని మార్కెట్‌, ఆలూరు, న్యూస్‌టుడే: ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ ప్రాంతాల్లో 5,800 వరకు ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇసుక కొరతతో పనులు ముందుకు సాగడంలేదు. నాగలదిన్నె, మంత్రాలయం, మేళిగనూరు, బూదూరు, అగ్రహారం ప్రాంతాల్లో రీచ్‌లు ఉన్నా, లబ్ధిదారుడి ఇంటి వద్దకు ఇసుక చేరేసరికి చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ప్రయత్నించినా ముందుగానే అయిపోతున్నాయని ఇంటి యజమానులు వాపోతున్నారు.

బి.తాండ్రపాడు ఇసుక డిపోలో సరఫరా తక్కువ.. ట్రాక్టర్లు ఎక్కువ

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని