Published : 05/12/2020 02:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మాలంటే అడవి.. కొనాలంటే కొరివి

● రైతుకు రూ.30 కూడా దక్కని ధర ●

బహిరంగ మార్కెట్లో రూ.70

ఈనాడు డిజిటల్‌, కర్నూలు: ఇప్పటికీ బహిరంగ మార్కెట్లో... ఉల్లి ధరలు తగ్గలేదు. నాణ్యమైన ఉల్లిగడ్డ కిలో రూ.70 వరకు పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులు తమకు మంచి ధరలు వస్తాయని ఆశిస్తారు. కానీ... వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

జిల్లాలో ఖరీఫ్‌లో మంచి వర్షాలు కురవటంతో... పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. 22 వేల హెక్టార్లలో ఉల్లి పంటను సాగు చేశారు. ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు పెట్టారు. మంచి దిగుబడులు వస్తే... ఎకరానికి సుమారు వంద క్వింటాళ్ల వరకు పంట వస్తుంది. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో కురిసిన వర్షాల కారణంగా... ఎకరానికి 50 క్వింటాళ్లు కూడా రావటం లేదు. మరోవైపు ఉల్లిగడ్డల్లో నాణ్యత లోపించటం, తేమ శాతం ఎక్కువగా ఉండటంతో మంచి ధరలు రావటం లేదు. దీనికితోడు కోత కూలీలు, రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.

ప్రస్తుతం కర్నూలు మార్కెట్‌కు తక్కువగానే సరకు వస్తోంది. మార్కెట్లో ఉల్లిగడ్డల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అయినా రైతులకు గిట్టుబాటు ధరలు రావటం లేదు. శుక్రవారం 1521 క్వింటాళ్ల... సరకు వచ్చింది. కనిష్ఠ ధర రూ. 820, గరిష్ఠ ధర రూ.2,950, సరాసరి ధర రూ.2,190 పలికింది. మంచి నాణ్యమైన ఉల్లిగడ్డకు కిలోకు రూ.30 వరకు పలుకుతోంది. సాధారణ గడ్డకు రూ.20 కంటే తక్కువే వస్తోందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని