
అగమ్యగోచరంలో అధికారులు
ప్రభుత్వ ఆదేశమా... ఈసీ ఉత్తర్వులా?
స్థానిక ఎన్నికలపై తెగని పంచాయితీ
కర్నూలు నగరం(జడ్పీ), న్యూస్టుడే: గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ను సమర్థిస్తూ గురువారం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కరోనా టీకాతో పాటు ఎన్నికలు కూడా ముఖ్యమని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలు నిర్వహించుకోవాలని కోర్టు సూచించడంతో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశముందనే తెలుస్తోంది. జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు, 10,466 వార్డులున్నాయి. 2018 ఆగస్టు 3 నుంచి పంచాయతీల్లో ప్రత్యేక పాలన కొనసాగుతోంది. కోర్టు తీర్పుతో గురువారం సాయంత్రం కర్నూలు జడ్పీ సమావేశ మందిరంలో జిల్లాలోని ఎంపీడీవోలతో సీఈవో వెంకట సుబ్బయ్య, డీపీవో ప్రభాకరరావు ఎన్నికలపై సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు ఎంపీడీవోలకు సమాచారం పంపారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని సమావేశం నిర్వహణ విరమించుకున్నారు. అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. అసలు ఇప్పుడు ఎవరి ఆదేశాలు పాటించాలో అంతుబట్టని పరిస్థితి నెలకొందని ఒక అధికారి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలు పాటిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందోనని.. ఒకవేళ ప్రభుత్వం ఆదేశం మేరకు చేస్తే ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకుంటుందోనని జిల్లా అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.