Published : 22/01/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాటు వైద్యుల చేతిలో పసి ప్రాణాలు బలి

రాఘవేంద్ర (దాచిన చిత్రం)

కృష్ణగిరి, న్యూస్‌టుడే: శాస్త్ర సాంకేతిక, వైద్య రంగాల్లో అన్ని విధాలుగా ముందడుగు వేసిన నేటి రోజుల్లోనూ ఇంకా నాటు వైద్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉంది. నాటు వైద్యం వికటించి కృష్ణగిరి మండలం టి.గోకులపాడు గ్రామానికి చెందిన బాలుడు రాఘవేంద్ర(7) మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలైన తెలుగు లక్ష్మన్న, వెంకటేశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు రాఘవేంద్ర సంతానం. కుమారుడు పుట్టినప్పటి నుంచి మూగతో పాటు కాళ్లు పనిచేయడం లేదు. చికిత్స కోసం చాలా ఆసుపత్రుల్లో చూపించినా నయం కాలేదు. గురువారం గ్రామానికి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నాటు వైద్యుల్లాగా మాట్లాడుతూ ద్విచక్రవాహనంపై తిరిగారు. ఈ క్రమంలో లక్ష్మన్న వారిని సంప్రదించగా చిన్నారి వ్యాధిని నయం చేస్తామని నమ్మబలికారు. గుర్తుతెలియని వ్యక్తులు చిన్నారిని చూసి వైకల్యాన్ని నయం చేస్తామని నాటు మందులు తినిపించారు. వెంటనే పిల్లాడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి అచేతనుడయ్యాడు. పరిస్థితి గమనించిన వారు, తులసి ఆకు తీసుకురావాలని తండ్రి లక్ష్మన్నను బయటకు పంపారు. ఆయన తిరిగి వచ్చేలోగా వాళ్లు ద్విచక్రవాహనంపై పరారయ్యారు. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఎస్సై రామాంజినేయరెడ్డి మాట్లాడుతూ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని