Published : 22/01/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గడప వద్దకే రేషన్‌ సరకులు

వాహనాల తాళాలను లబ్ధిదారులకు అందజేస్తున్న మంత్రి
గుమ్మనూరు జయరాం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, జేసీ

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ప్రజా పంపిణీ వ్యవస్థలో వినూత్న మార్పులు తీసుకొచ్చి కార్డుదారుల గడప వద్దకే నిత్యావసర సరకుల పంపిణీకి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేసే డోర్‌ డెలివరీ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన గురువారం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కలెక్టర్‌ వీరపాండియన్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ సభ్యులు డా.సంజీవ్‌కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, ప్రభుత్వ విప్‌ గంగుల ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, డా.జె.సుధాకర్, కంగాటి శ్రీదేవి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, జేసీలు రాంసుందర్‌ రెడ్డి, ఖాజా మొహిద్దీన్, నగరపాలక కమిషనర్‌ డి.కె.బాలాజీ, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి, డీఆర్వో పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మంత్రి గుమ్మనూరు మాట్లాడుతూ గతంలో మజరా గ్రామాల్లో ప్రజలు 3-4 కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్‌ తెచ్చుకునేవారని, ప్రస్తుతం కార్డుదారుల ఇంటి వద్దకే నిత్యావసరాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని, ప్రస్తుతం మరో 10 వేల మందికి మొబైల్‌ డోర్‌ డెలివరీ వాహనాల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించినట్లు వివరించారు. కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి పారదర్శకతతో మినీ ట్రక్కులను ప్రవేశపెట్టి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచారన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కరోనా నిర్మూలనకు వాలంటీర్లు చురుగ్గా పనిచేశారన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 2,436 చౌకధరల దుకాణాలకు సంబంధించి 12 లక్షల మంది రైస్‌ కార్డుదారులకు 760 వాహనాల ద్వారా 15 నుంచి 20 రోజుల్లో నిత్యావసర సరకులను ఇంటింటికి అందించే ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా రూపొందించామన్నారు. వచ్చే నెల 1 నుంచి కార్డుదారుల ఇంటి వద్దకే వచ్చి సరకులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లబ్ధిదారులకు వాహనాల తాళాలను అందజేశారు. కర్నూలు, ఆదోని ఆర్డీవోలు వెంకటేశులు, రామకృష్ణారెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ఈడీలు చంద్రశేఖర్, రమాదేవి, శిరీష, సబిహా పర్వీన్, డీఎస్‌వో పద్మశ్రీ, పౌరసరఫరాల సంస్థ డీఎం షర్మిల తదితరులు పాల్గొన్నారు.  


సదస్సులో పాల్గొన్న అధికారులు, లబ్ధిదారులు  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని