
ఆయాల నియామకానికి పచ్చజెండా
డీఈవో సాయిరాం
న్యూస్‌టుడే-కర్నూలు విద్య ప్రభుత్వ యాజమాన్యంలో 1,991 ప్రాథమిక, 365 ప్రాథమికోన్నత, 612 ఉన్నత పాఠశాలల్లో 4,16,176 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లతో సహా అన్నింటిలో మరుగుదొడ్ల నిర్వహణకుగాను ఆయాల నియామకానికి పాఠశాల స్థాయిలో భర్తీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 4-5 గంటల వరకు, ఉన్నత బడుల్లో ఉదయం 8.45 నుంచి 11.45 వరకు, మధ్యాహ్నం 2-4 గంటల వరకు ఆయాలు పనిచేయాల్సి ఉంది.
భర్తీ ఇలా..: 400 మంది విద్యార్థులకు ఒక ఆయా, 401 నుంచి 800 వరకు ఇద్దరు. 800.. ఆపైన ముగ్గురు ఆయాలను నియమించాలి. విద్యాలయాల్లో మరుగుదొడ్లు లేనిచోట ఆయాల నియామకం వర్తించదు. ఇప్పటికే పనిచేస్తున్న ఆయాలు తల్లిదండ్రుల కమిటీ ఆమోదంతో కొనసాగవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 50 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలల్లోని ఆయాలకు నెలకు రూ.3 వేలు. ఆపైన స్కూల్స్‌లోని ఆయాలకు నెలకు రూ.6 వేలు చెల్లిస్తారు. వీరికి 10 నెలల పూర్తి జీతం.. మరో రెండు నెలలు సగం వేతనం చెల్లిస్తారు. ఆయాల ఎంపికకు సంబంధించి కమిటీలదే తుది నిర్ణయమని డీఈవో సాయిరాం పేర్కొన్నారు. ఇందులో హెచ్ఎంలు కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారన్నారు.
400 మంది విద్యార్థులకు ఒకరు..
తల్లిదండ్రుల కమిటీ ఆమోదంతో భర్తీ
ప్రభుత్వ పాఠశాలల్లో (రెసిడెన్షియల్ స్కూల్స్ కలిపి) పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇక నుంచి బడుల ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణకుగాను ఆయాల నియామకానికి ప్రభుత్వం సానుకూలత తెలిపింది. విద్యాలయాల్లో హాజరును బట్టి భర్తీ చేసే బాధ్యతను కమిటీలకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే అమ్మఒడి పథకంలోని డబ్బులను ఒక్కో లబ్ధిదారుల నుంచి రూ.1,000 చొప్పున సేకరించిన నిధులను పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఖర్చు చేయనున్నారు. ఆయాల నియామక ప్రక్రియ ఈనెల చివరిలోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు.