Published : 22/01/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రణాళిక లేక...రోడ్డున పడేశారు

 రూ.కోటితో కూరగాయల మార్కెట్‌ అభివృద్ధి పనులు
 నిరుపయోగంగా షెడ్లు 
 చిరువ్యాపారులకు అష్టకష్టాలు


రోడ్డుపైనే సాగిస్తున్న కూరగాయల విక్రయాలు

నంద్యాల ప్రత్యేక జిల్లాగా తెరపైకి వచ్చింది. ఇలాంటి తరుణంలో ప్రస్తుత జనాభాకు తగ్గట్టు అభివృద్ధి ప్రణాళికలుండాలి. అలాకాకుండా పట్టణ నడిబొడ్డున ఇరుకు సందుల్లో కూరగాయల టోకు, చిల్లర దుకాణాలు ఒకేచోట నిర్వహించడం అనాలోచితమే. అంతేకాదు నిధులు కుమ్మరించి అక్కడే సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టగా నిరుపయోగంగా మారింది. నంద్యాల గాంధీచౌక్‌ కూరగాయల మార్కెట్‌ తీరిది.

ఈనాడు డిజిటల్, కర్నూలు ఈ మార్కెట్‌కు అరవై ఏళ్ల చరిత్ర ఉంది. కూరగాయల మార్కెట్‌కు నిత్యం వేలాది మంది వినియోగదారులు వస్తుంటారు. చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు పండించిన పంటలను వ్యాపారులు మార్కెట్‌కు తీసుకొచ్చి టోకుగా అమ్ముతుంటారు. నిత్యం 30 టన్నులకు పైగా కూరగాయల విక్రయాలు జరుగుతుంటాయి. ఇలాంటి మార్కెట్‌లో లాబియింగ్, ఆధిపత్యం రాజ్యమేలుతున్నాయి. ఫలితంగా చిరువ్యాపారులు రోడ్డున పడుతున్నారు.
దుకాణాలు వదిలి రోడ్లపైనే...: గాంధీచౌక్‌ కూరగాయల మార్కెట్‌ ఆధునికీకరణకు మున్సిపాల్టీ సాధారణ నిధులు రూ.కోటి కేటాయించారు. రూ.15 లక్షలతో షెడ్డు నిర్మించి 78 మంది వ్యాపారులు కూర్చొని అమ్ముకునేలా తీర్చిదిద్దారు. గత డిసెంబరు 26న ప్రారంభించారు. అయితే కొనుగోలుదారులు రారని కొందరు వ్యాపారులు పాత పద్ధతిలోనే రోడ్లపై కూరగాయలు పోసి అమ్మకాలు చేపడుతున్నారు. మరోవైపు ఉదయం పది గంటలకే మూతవేయాల్సిన హోల్‌సేల్‌ వ్యాపారులు సైతం సాయంత్రం వరకు రిటైల్‌గా తమ గదుల ముందే విక్రయాలు కొనసాగిస్తున్నారు. దీంతో మున్సిపాల్టీ కేటాయించిన దుకాణాల్లోని చిరు వ్యాపారులకు బేరాల్లేక, సరకు దెబ్బతిని నష్టాల పాలవుతున్నారు. చేసేది లేక, తెచ్చిన అప్పులు తిరిగి కట్టలేక తలలు పట్టుకుంటున్నారు.
పట్టణానికి దూరంగా....: నంద్యాల పట్టణ జనాభా సుమారు 3 లక్షలకు చేరింది. ఇలాంటి తరుణంలో గాంధీచౌక్‌ మార్కెట్‌లో కేవలం రిటైల్‌ అవుట్‌లెట్లు పెట్టి, టోకు మార్కెట్‌ను పట్టణానికి దూరంగా ఉంచాలనేది నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం రెండూ ఒకే చోట ఇరుకులో జరగడం వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. పైగా టోకు వ్యాపారులే చిల్లర విక్రయాలు చేపడుతుండటంతో 300 పైగా చిరు వ్యాపారుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి సమస్యలున్నచోట వ్యాపారులకు అవగాహన కల్పించి ప్రణాళికగా అడుగులు వేయాల్సిన మున్సిపాల్టీ విఫలమైంది.


నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయం

ఇరుకులోనే అభివృద్ధి....
మొత్తం రూ.కోటి నిధుల్లో షెడ్డుకు రూ.15 లక్షలు, టోకు వర్తకులకు కట్టించిన ఏడు గదులకు రూ.35 లక్షలు ఖర్చు చేశారు. అదేవిధంగా మురుగు కాల్వకు రూ.13 లక్షలు, రోడ్డు నిర్మాణానికి రూ.11 లక్షలు, ముఖద్వారం గేటు, పశువులు రాకుండా మూడు వైపులా గేట్లకు రూ.17 లక్షలు, విద్యుత్తు సదుపాయానికి, మరుగుదొడ్లు తదితర సదుపాయాలకు మిగిలిన నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించారు. దీనిపై పురపాలక కమిషనర్‌ వెంకటకృష్ణ ‘ఈనాడు’తో మాట్లాడుతూ మార్కెట్‌లో సమస్య ఉన్న మాట వాస్తవమే అన్నారు. మూడు రోజుల్లో ప్రత్యేక దృష్టి పెట్టి సమస్య పరిష్కరిస్తానని పేర్కొన్నారు.

ఈ చిత్రంలోని నూర్‌ సాధిక్‌ నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్డులో దుకాణం పొందారు. దుకాణాలు పొందిన చాలామంది వ్యాపారులు పాత పద్ధతిలో అమ్మడంతో షెడ్డుకు వచ్చే కొనుగోలుదారులు కరవయ్యారని సాధిక్‌ తెలిపారు. టోకు వ్యాపారులే రిటైల్‌గా అమ్మడంతో తమలాంటి చిరువ్యాపారులెందరో నష్టపోతున్నామన్నారు. నూతన షెడ్డులో అధికారులు విద్యుత్తు సరఫరా సైతం నిలిపివేశారని తెలిపారు. పూర్తిస్థాయిలో వసతులు కల్పించి అందరినీ ఒకేచోట అమ్మేలా నిబంధనలు కఠినతరం చేస్తే తప్ప తమ జీవితాలు గాడిన పడవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని