
సాంకేతిక విధానాలపై పట్టు అవసరం
ధ్రువపత్రాలు అందిస్తున్న డీఈవో ఎం.సాయిరాం
కర్నూలు విద్య, న్యూస్టుడే: సాంకేతిక విద్యా విధానాలను పాఠశాల దశ నుంచే అలవాటు చేసుకుని విద్యార్థులను చైతన్యవంతులను చేయాలని జిల్లా విద్యాధికారి ఎం.సాయిరాం అన్నారు. విద్యాశాఖ, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో ‘దీక్ష ఈకంటెంట్ క్రియేషన్ ట్రైనింగ్’ అన్న అంశంపై కర్నూలు శివారు వెంకాయపల్లిలోని రవీంద్ర మహిళా ఇంజినీరింగ్ కళాశాల సమావేశ భవనంలో గత నాలుగు రోజులుగా ఇస్తున్న శిక్షణ శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి డీఈవో, సమగ్రశిక్ష ఏపీసీ వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా హాజరై ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. పాఠ్య పుస్తకాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులను అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించిందని పేర్కొన్నారు. చివరిరోజు బోధనకు సహకరించే పలు వీడియోలు తయారు చేసి దీక్ష యాప్లో అప్లోడ్ చేశారు. ఈ శిక్షణలో పాల్గొన్న రిసోర్స్ పర్సన్, ఛాత్రోపాధ్యాయులకు అతిథుల చేతులమీదుగా ధ్రువపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంవో ప్రసాద్, ఏఏఎంవో రఫీ తదితరులు పాల్గొన్నారు.