
ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి
నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకుని కేక్ కోస్తున్న నేతలు
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: తెదేపా కార్యకర్తల కోసం ప్రత్యేకంగా సంక్షేమ నిధిని ఏర్పాటుచేసి బాధిత కుటుంబాలకు మాజీ మంత్రి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అండగా నిలిచారని కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాల తెదేపా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం లోకేష్ జన్మదిన వేడుకలు, స్వాతంత్య్ర పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ జయంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనకు వ్యతిరేకంగా లోకేష్ పోరాడి పార్టీకి తిరిగి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. ఎన్నికల కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన ఇచ్చారని, ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి తెదేపా మద్దతుదారులకు చేయూతనివ్వాలని చెప్పారు. ఎన్నికలు ఏకపక్షంగా కాకుండా సజావుగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేందుకు అధికారులు దోహదపడాలని, ప్రజలను.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ ఛైర్మన్ మల్లెల రాజశేఖర్, తెదేపా రాష్ట్ర కార్యదర్శులు నాగేంద్రకుమార్, రవికుమార్, ప్రభాకర్, తెలుగు మహిళా కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు పార్లమెంట్ తెలుగు మహిళా కార్యదర్శిగా నియమితులైన మారుతి శర్మ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డిని కలిసి పుష్పగుచ్ఛాలు అందించి కృతజ్ఞతలు తెలిపారు.