
ఉపాధి కోసం వెళ్లిన కూలీ దుర్మరణం
భార్య, పిల్లలతో మాబూబాషా (పాతచిత్రం)
కళ్యాణదుర్గం గ్రామీణం: ఉపాధి కోసం సొంత జిల్లా దాటి వస్తుండగా కూలీ దుర్మరణం పాలైన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకుల వివరాల మేరకు.. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లికి చెందిన మాబూ బాషా(44) కూలి పనులు చేసుకుంటూ భార్యా పిల్లలను పోషించుకునేవాడు. ఆదివారం రాత్రి నల్లబండలను ట్రాక్టర్లో వేసుకుని డ్రైవర్‌తో పాటు కళ్యాణదుర్గం బయల్దేరారు. శీబాయి గ్రామం వద్దకు రాగానే ముందుగా వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి సిమెంట్ లారీ ఢీకొంది. మాబూబాషా కిందపడగా చక్రం ఆయనపై వెళ్లింది. 108లో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స నిమిత్తం అనంతపురం తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. భార్య దస్తగిరమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.