Published : 24/01/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్వచ్ఛ కర్నూలు

- ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తే చర్యలు

- స్థలాలు గుర్తిస్తున్న అధికారులు


 ఖాళీ స్థలాల్లోని చెత్త 

ఈనాడు డిజిటల్, కర్నూలు: నగరాల్లో స్థలాలు కొని వదిలేసి... డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవటం లేదా రేటు పెరిగినప్పుడు అమ్ముకోవటం చేస్తుంటారు. ఈలోగా... వాటిలో పిచ్చిమొక్కలు పెరగటం, భవన వ్యర్థాలు, చెత్త వేయటం చేస్తుంటారు. దీనివల్ల దోమలు, ఈగలతో... దుర్గంధంతో.. ఆ ప్రాంతంతో జబ్బులు వ్యాపించే అవకాశం లేకపోలేదు. స్వచ్ఛ కర్నూలు కోసం ఇలాంటి వారిపై కర్నూలు నగరపాలక సంస్థ చర్యలకు ఉపక్రమించింది.
ఖాళీ ప్రదేశాలవల్ల వ్యాధులు

నగరంలో సుమారు ఆరు లక్షల జనాభా ఉంది. నగరం వేగంగా విస్తరిస్తోంది. ఇళ్ల స్థలాల విలువ రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. గతంలో ఎప్పుడో స్థలాలు కొని వదిలేసినవారు, పూర్వీకుల నుంచి వచ్చిన స్థలాలు చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిని కొందరు ప్రహరీ నిర్మించి కాపాడుకుంటుండగా... మరికొందరు ఖాళీగానే వదిలేస్తున్నారు. వీటిలో భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త వేయటం, పిచ్చిమొక్కలు పెరగటంతో... అపరిశుభ్రత నెలకొంటోంది. దుర్గంధం వెదజల్లుతోంది. ఈగలు, దోమలు, పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇలాంటి అపరిశుభ్రత వల్ల జబ్బులు వచ్చే ప్రమాదం లేకపోలేదు.
ప్రయోగాత్మకంగా...

కర్నూలు నగరంలో సుమారు 2 వేల ఖాళీ స్థలాలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి వాటిని పరిశుభ్రంగా ఉంచకపోతే... చర్యలు తీసుకుంటామని ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారులు పలు దఫాలు యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. అయినా చాలామంది స్పందించలేదు. స్వచ్ఛ కర్నూలులో భాగంగా... ఖాళీ స్థలాల్లో చెత్తను తొలగించే బృహత్‌ కార్యానికి అధికారులు దిగారు. యజమానులే చెత్తను తొలగించాలి. లేదంటే ఆ చెత్తను నగరపాలక సిబ్బందే తొలగిస్తారు. దీనికి రుసుములు వసూలు చేస్తారు. ఇప్పటికే నగరంలో న్యూ కృష్ణానగర్‌ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా... ఈ కార్యక్రమం చేపట్టారు.
 చెత్తను గుర్తించే పనిలో...

నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను గుర్తించగా... మిగిలిన స్థలాల వివరాలను సైతం సేకరించే పనిని వార్డు, శానిటేషన్‌ సిబ్బందికి అప్పగించారు. సాధ్యమైనంత త్వరగా వీటిని గుర్తించి... చెత్తను తొలగించే పనిని నెలలోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అందరూ కలిసి రావాలి
స్వచ్ఛ కర్నూలులో భాగంగా ప్రయోగాత్మకంగా నగరంలో చెత్తను తొలగించే పనిని మొదలు పెట్టాం. చెత్తను యజమానులే తొలగించి, చుట్టూ ప్రహరీ నిర్మించుకోవాలి. లేదంటే మేమే చెత్తను తొలగించి వినియోగ రుసుములు వసూలు చేస్తాం. చెత్త రహిత కర్నూలు కోసం అందరూ కలిసి రావాలి.  - డీకే బాలాజీ, కమిషనర్‌
ఇతర సమస్యలు పరిష్కరించడం లేదు
చెత్త తొలగింపు పేరుతో భారీగా అపరాధ రుసుములు వసూలు చేస్తున్నారు. కనీసం మురుగునీటి కాల్వలు శుభ్రం చేయటంలో, ఇతర సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తున్న నగరపాలక సిబ్బంది... ఈ విషయాన్నే ఎందుకు పట్టుకున్నారు.  - సురేష్, కృష్ణానగర్‌ 


చెత్తను తరలిస్తున్న నగరపాలక సిబ్బంది


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని