
ముచ్చుమర్రిలో ముగ్గురు వ్యక్తుల అరెస్టు
దురుద్దేశంతో మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించినట్లు వెల్లడి
పోలీసుల అదుపులో నిందితులు
నందికొట్కూరు, న్యూస్టుడే: ముచ్చుమర్రికి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ ప్రసాద్ తెలిపారు. శనివారం రాత్రి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామంలో కొందరు వ్యక్తులు గొడవకు ప్రయత్నించగా ఎస్సై శ్రీనివాసులు, సిబ్బంది గమనించి వారిని వారించి కేసు నమోదు చేసి తహసీల్దారుకు పంపారన్నారు. ఈ క్రమంలో వారు తమపై ఉన్న కేసులను తప్పించుకునే దురుద్దేశంతో, ఎవరో ఇచ్చిన తప్పుడు సలహాపై దిల్లీకి వెళ్లి అక్కడ మైనార్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ను సంప్రదించి ఎస్సై శ్రీనివాసులుపై ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. విధుల్లో భాగంగానే గ్రామంలో శాంతిభద్రతల విషయమై గొడవలు పడకుండా ఉండాలని అప్పట్లో పోలీసులు చర్యలు తీసుకున్నారన్నారు. గతంలో మసీదు విషయంలో కరీమ్, ఇబ్రహీమ్ కుటుంబాల మధ్య గొడవలున్నాయన్నారు. ఇబ్రహీమ్ కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన కొంతమందిపై అప్పట్లో కేసు నమోదు చేశామన్నారు. శనివారం గ్రామానికి చెందిన కరీమ్, జలీల్, సలీమ్లను అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు.