
బాలుడి ప్రాణం తీసిన స్తంభం
వివేక్ చంద్ర (దాచిన చిత్రం)
పగిడ్యాల, న్యూస్టుడే: విద్యుత్తు స్తంభాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో స్తంభం బాలుడిపై పడి మృత్యు ఒడికి చేరారు. పగిడ్యాలకు చెందిన గోదా చిన్న డానియల్ కుమారుడు గోదా వివేక్చంద్ర (5) మంగళవారం ఇంటి ముందు ఆడుకుంటున్నారు. అదే వీధిలో ట్రాక్టర్ చోదకుడు స్వాములు అతివేగంతో వస్తూ పాత విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టారు. స్తంభం విరిగి అక్కడే ఆడుకుంటున్న బాలుడిపై పడింది. స్థానికులు గమనించి చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో చేరుకని చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే వివేక్ మృతి చెందినట్లు నిర్ధరించారు. డానియల్ దివ్యలు గౌండ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి అనూహ్య, వివేక్ చంద్ర ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై జఫ్రుల్లా ఖాన్ పేర్కొన్నారు. స్తంభం ఒరిగిందని విద్యుత్తు అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.