
నియంతృత్వ పోకడలు తగవు
సుప్రీంకోర్టు తీర్పు అభినందనీయం
కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి
అంబేడ్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న సోమిశెట్టి తదితరులు
కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఇకనైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి పులివెందుల రాజ్యాంగాన్ని పక్కనపెట్టి భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ మంగళవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శులు నాగేంద్రకుమార్, శ్రీరాములు, నరసింహులు యాదవ్, ప్రభాకర్ తదితరులతో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో బ్రిటీష్ వారి పాలనను మరిపించేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. విదేశాల్లో చదువుకొంటున్న విద్యార్థుల విషయమై ప్రశ్నిస్తే టీఎన్ఎస్ఎఫ్ నాయకులను అరెస్టు చేసి జైలులో పెడతారా అని ప్రశ్నించారు. ఏం నేరం చేశారని కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, కేఈ శ్యాంబాబుపై కేసులు నమోదు చేశారని నిలదీశారు. వైకాపా నాయకులు పెద్దసంఖ్యలో జనాన్ని పోగుచేయొచ్చని, అదే తెదేపా నాయకులు చేస్తే కరోనా నిబంధనలు కనపడతాయా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో వెళ్తోందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా కర్నూలు, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షురాళ్లు ముంతాజ్, పార్వతమ్మ, తెదేపా నాయకులు ఎస్.అబ్బాస్, జేమ్స్, సత్రం రామకృష్ణుడు, హనుమంతరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు.
టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష
నగరంలోని తెదేపా కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు రామాంజినేయులు ఆధ్వర్యంలో జీవో 77ను రద్దు చేయాలని, సీఎం కార్యాలయం ముట్టడికి వెళ్లిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ నాయకులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి తెదేపా నాయకులు మద్దతు తెలిపారు.
తెదేపా కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు చేపట్టిన నిరాహార దీక్షకు
మద్దతు తెలుపుతున్న నాయకులు