
ఫ్యాక్షన్గ్రామాలపైప్రత్యేక దృష్టి
ముందస్తుగా జిల్లాలో 40 చెక్‌పోస్టుల ఏర్పాటు
పంచాయతీ ఎన్నికల్లో సాంకేతికతను వాడతాం
భయం, ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి
‘ఈనాడు’తో ఎస్పీ ఫక్కీరప్ప
నిఘా నేత్రాల పరిశీలనలో...
ఈనాడు డిజిటల్, కర్నూలు: ‘స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి. భయం, ప్రలోభాలకు గురికాకుండా ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని’ ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సూచించారు. తొలివిడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో ఫ్యాక్షన్ గ్రామాలు, గత ఎన్నికల్లో ఘర్షణలు జరిగిన పల్లెలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించి, ఎలక్టోరల్ ప్రాక్టీస్ అవార్డును గవర్నర్ నుంచి అందుకున్న ఎస్పీతో మంగళవారం ‘ఈనాడు’తో ముఖాముఖి మాట్లాడారు. పల్లెపోరుకు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో ఎన్నికల బందోబస్తు, చెక్‌పోస్టులు, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్ల గురించి ఆయన పలు వివరాలు వెల్లడించారు.
ప్రత్యేక విభాగం ఏర్పాటు...
తొలి విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ గ్రామాలను ఇప్పటికే గుర్తించాం. జిల్లాలో ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచేలా కొంతమంది బృందంతో ‘ప్రత్యేక విభాగం’ ఏర్పాటు చేశాం. గతంలో బాంబులు చుట్టే వ్యక్తుల జాబితా సైతం దగ్గర పెట్టుకుని ఆయా ఇళ్లల్లో, గ్రామాల్లో సోదాలు నిర్వహిస్తాం. రౌడీషీటర్లు, గత ఎన్నికల్లో ఘర్షణలకు దిగిన వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని బైండోవర్ చేస్తాం. పరిస్థితులను బట్టి రక్షణ కావాలనే పార్టీలకు అతీతంగా సర్పంచి అభ్యర్థులు, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పిస్తాం.
ముందస్తుగా చెక్ పోస్టులు..
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ సరిహద్దులో పంచలింగాల, ఇ.తాండ్రపాడు, దేవమడ, గూడూరు, శ్రీశైలం, కర్ణాటక సరిహద్దుల్లో కౌతాళం, మంత్రాలయం, హోళగుంద, హాలహర్వి, ఇస్వి(ఆదోని) పరిధిలో పది చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం. అంతర్ జిల్లాల పరిధిలో ప్యాపిలి, ఆత్మకూరు, మహానంది, చాగలమర్రి పరిధిలో చెక్ పోస్టులుంటాయి. ఇలా మొత్తం జిల్లాలో 40 చెక్ పోస్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టాం. ఎన్నికల్లో మద్యం, డబ్బు రవాణాలపై ముందు నుంచే కట్టడి చేసేందుకు అడుగులు వేస్తున్నాం. మద్యం, డబ్బు పంపిణీపై డయల్ 100, 112, జిల్లా కమాండ్ కంట్రోల్ రూం(08518-279001) నెంబర్లకు సమాచారం ఇవ్వవచ్చు. తక్షణమే స్పందించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం.
ఎన్నికల్లో విశ్రాంత సైనికోద్యోగుల సేవలు...
జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రస్తుతం ఉన్న సివిల్, ఏఆర్, హోంగార్డులు 5 వేల మందిని పైగా ఉపయోగించుకోనున్నాం. ఏపీఎస్పీ బృందాలు అదనంగా జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. విశ్రాంత సైనికోద్యోగుల సేవలను ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని నిర్ణయించాం. లైసెన్స్ తుపాకీలు సరండర్ చేసుకున్నాం.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై సాంకేతిక నిఘా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా పెంచుతాం. ఇప్పటికే జిల్లాలో ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో 15 వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇవి కాకుండా ఎన్నికల సమయంలో సమస్యాత్మక కేంద్రాల వద్ద వెబ్‌క్యాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తుంటాం. సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈ-సీజర్, ఈ-నాకాబంది, పోలీస్ డాట్ కామ్ వెబ్ అప్లికేషన్లకు సంబంధించిన టెక్నాలజీలను, చెక్‌పోస్టులలో ఈ-టెక్నాలజీ ద్వారా రియల్ టైం బేసిన్లో వాహనాల తనిఖీలు, ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అప్లోడు చేస్తూ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం. లైసెన్సు తుపాకీలకు క్యూఆర్ కోడింగ్ ఇస్తాం. వెబ్‌క్యాస్టింగ్, సీసీ కెమెరాలు, బాడీ ఓన్ కెమెరాలతోపాటు డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తాం. సంచార నిఘా వాహనం(ఫాల్కన్)ను అందుబాటులో ఉంచుతాం. చెక్‌పోస్టులతోపాటు సమస్యాత్మక గ్రామాల్లో నిరంతరం నాకాబందీ నిర్వహిస్తాం.