
పల్లెల్లో పంచాయతీ పోరు
వేడెక్కిన రాజకీయం
కీలక కార్యకర్తల సమీకరణలో నేతలు
ఆలూరు గ్రామీణ, హాలహర్వి, న్యూస్టుడే: పల్లెపోరులో రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు పార్టీలు సిద్ధమవుతున్నారు. గతేడాది మార్చిలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను కరోనా వైరస్ కారణంగా వాయిదా వేసిన ఎన్నికలు సంఘం ఎట్టకేలకు ఈనెల 23 తేదీన నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ పూర్తయిన తరువాతే ఎన్నికలు నిర్వహిస్తామని పట్టుపట్టడంతో ఎన్నికల కమిషన్ కోర్టును ఆశ్రయించింది. సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. ఇప్పటికే సర్పంచి ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెలో రాజకీయం వేడెక్కింది. కరోనా నిబంధనలు పూర్తిగా సడలించడంతో ఆయా రాజకీయ పార్టీ నాయకులు వివిధ కార్యక్రమాలకు హాజరవుతూ తమ పార్టీ కార్యకర్తలను ఆకర్షిస్తున్నారు.
అంతా.. నేతల కనుసన్నల్లోనే
పశ్చిమ ప్రాంతంలోని ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు, హాలహర్వి, చిప్పగిరి, హొళగుంద, ఆస్పరి, దేవనకొండ మండలాలు ఉన్నాయి. వందకు పైగా పంచాయతీలు ఉన్నాయి. వీటికి ఇప్పటికే పంచాయతీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామాల్లో సమీకరణాలు మారుతున్నాయి. పల్లెల్లో కీలకంగా వ్యవహరించే కార్యకర్తలను మచ్చిక చేసుకునే పనుల్లో చోటామోటా నాయకులు నిమగ్నమయ్యారు. మరో వైపు ఓటర్లను సైతం తమవైపు తిప్పుకొనేందుకు నాయకులు పావులు కదుపుతున్నారు. సర్పంచి ఎన్నికలు రాజకీయ పార్టీలతో సంబంధం లేకున్నా వారి కనుసన్నల్లో జరుగుతాయన్నది బహిరంగ సత్యమే. నియోజకవర్గంలో 107 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 2,35,852 మంది ఓటర్లు ఉన్నారు.