Published : 27/01/2021 04:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్వేచ్ఛా సంక్షేమమే.. గణతంత్ర లక్ష్యం!

జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ వీరపాండియన్,

చిత్రంలో ఎస్పీ ఫక్కీరప్ప తదితరులు    

కర్నూలు సచివాలయం, నేరవిభాగం, న్యూస్‌టుడే: ప్రజల స్వేచ్ఛా, సంక్షేమమే గణతంత్ర లక్ష్యమని కలెక్టర్‌ వీరపాండియన్‌ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీసు కవాతు మైదానంలో గణతంత్ర దిన వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవవందనం సమర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ, ఇతర స్వాతంత్య్ర సమరయోధులకు, రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్‌ బీ.ఆర్‌.ఆంబేడ్కర్‌కు భారతావని నీరాజనాలు అర్పిస్తుందన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులైన డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేడ్కర్‌ సారథ్యంలో ముసాయిదా కమిటీ సభ్యుల్లో ఒకరైన జిల్లాకు చెందిన సర్దార్‌ నాగప్ప లాంటి మహానుభావుల కృషి శ్లాఘనీయమన్నారు. రాజ్యాంగ పరిధిలో మన స్వేచ్ఛను వినియోగించుకొని విలువను పెంపొందించుకోవాలన్నారు. జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులయ్యేందుకు ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. అనంతరం పలు కార్యక్రమాలు జరిగాయి. చివరగా ప్రభుత్వ శాఖల స్టాళ్లను సందర్శించి తిలకించారు. వ్యవసాయ, వికలాంగుల, ఏపీఎంఐపీ(బిందుసేద్యం) విభాగాల స్టాళ్లకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు.
*స్వాతంత్య్ర సమరయోధుడు సుధాకర్‌ సతీమణి మంగమ్మను కలెక్టర్, ఎస్పీ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. శాలువాతో సత్కరించి గౌరవించారు.
*కల్లూరు కేజీబీవీ పాఠశాల, గార్గేయపురం జడ్పీ హైస్కూల్, బీ.క్యాంపు ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, ఆర్‌సీరెడ్డి డిగ్రీ కళాశాల విద్యార్థులు దేశభక్తి గీతాలకు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. కల్లూరు కేజీబీవీ, గార్గేయపురం జడ్పీ, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ విద్యార్థులకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు దక్కాయి. ఎస్పీ డా కె.ఫక్కీరప్ప, జేసీలు రామసుందర్‌రెడ్డి, ఖాజామోహిద్దీన్, నగరపాలక సంస్థ కమిషనర్‌ డి.కె.బాలాజీ, శిక్షణ కలెక్టర్‌ నిధిమీనా, శిక్షణ ఐపీఎస్‌ ప్రతాప్‌ శివకిషోర్, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

800 మందికిగాను 60 మందికి పత్రాల అందజేత
గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 800 మందిని ప్రశంసాపత్రాలకు ఎంపిక చేశారు. మంగళవారం పోలీసు పరేడ్‌ మైదానంలో 60 మందికి మాత్రమే అందజేశారు. మిగిలిన పత్రాలను ఆయా శాఖల అధికారులకు పంపారు. వారు తమ సిబ్బందికి అందజేయనున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని