Published : 28/02/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సమష్టి కృషితో అభ్యర్థులను గెలిపించుకుందాం

 సమావేశంలో ప్రసంగిస్తున్న కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, వేదికపై 
 కేఈ, సోమిశెట్టి, టీజీ భరత్‌ తదితరులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కర్నూలు నగరపాలక ఎన్నికల్లో సమష్టి కృషితో కార్పొరేటర్‌ అభ్యర్థులను గెలిపించుకుందామని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని మేయర్‌ స్థానాన్ని దక్కించుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెదేపా కర్నూలు నియోజకవర్గ సర్వసభ్య సమావేశం పార్టీ ఇన్‌ఛార్జి టీజీ భరత్‌ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని మౌర్యా ఇన్‌లో జరిగింది. కేంద్ర మాజీ మంత్రి, తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమిశెట్టి మాట్లాడుతూ నగరపాలక ఎన్నికల్లో సీపీఐ మిత్రపక్షంగా చేరడంతో మరింత బలం చేకూరిందని చెప్పారు. సీపీఐ నేత జగన్నాథం మాట్లాడుతూ సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. 
ఆ మూడు కుటుంబాల వల్లే అభివృద్ధి: కోట్ల, కేఈ, టీజీ కుటుంబాల వల్లే కర్నూలు అభివృద్ధి జరిగిందని, ఇది నగర ప్రజలకు తెలుసని తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. పోలీసులు పలు విధాలా భయపెట్టినా పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో తెదేపా మద్దతుదారులు గెలుపొందారని చెప్పారు. ప్రజల తరఫున పోరాడే తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కర్నూలులో వైకాపా పరిస్థితి అధ్వానంగా ఉందని, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ         మోహన్‌రెడ్డి, వైకాపా నాయకులు రాజా విష్ణువర్దన్‌రెడ్డి, తెర్నేకల్‌ సురేంద్రారెడ్డి తదితరులు టికెట్ల కోసం కొట్లాడుకుంటున్నారని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ అన్నారు. రాత్రివేళ విద్యుత్తు సరఫరా ఆపేసి పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ జరపడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. నగరంలో చాలాచోట్ల వీధి దీపాలు వెలగడం లేదని, వైకాపా ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కార్పొరేషన్‌లో తెదేపా జెండా ఎగురవేయాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా బాధ్యుడు టీజీ భరత్‌ పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా.. ప్రజల తరఫున పోరాడాలన్నా తెదేపా అభ్యర్థులను గెలిపించాలన్నారు. సోషల్‌ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను తెదేపాలోనే ఉంటానని, తమ అభ్యర్థులను గెలిపించుకుంటానని చెప్పారు. తెదేపా నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లి కార్పొరేటర్‌ సీటు ఆశించి రానివాళ్లు ఇష్టమైతే తిరిగి తమ పార్టీలోకి రావొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు సర్దార్‌ బుచ్చిబాబు, కార్పొరేటర్‌ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.  


హాజరైన తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని