Published : 28/02/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒంటికొస్తేకడపుబ్బాల్సిందే!


 సర్వజన వైద్యశాల ప్రధాన గేటుకు సమీపంలోని మూత్రశాల ఇలా 

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు: అధునాతన మరుగుదొడ్లన్నారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించారు. స్వచ్ఛతపై చైతన్యం కల్పించేలా పోస్టర్లు సైతం అతికించారు. లోపల మాత్రం నిర్వహణ లేక నిరుపయోగంగా మార్చారు. ఇదీ స్వచ్ఛ కర్నూలులో భాగంగా చేపట్టిన మరుగుదొడ్ల దుస్థితి. పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టకపోవడం, ఉన్నదాన్ని పక్కనబెట్టి కొత్త వాటి ఏర్పాటుకు ప్రణాళికలు చేయడం లోపాలుగా కనిపిస్తున్నాయి.

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ నిధులు రూ.30 వేలు, నగరపాలక సంస్థ రూ.30 వేలు కలిపి ఆధునిక మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇలా ఒక్కోదానికి రూ.60 వేల చొప్పున వెచ్చించి 52 ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేశారు. రెండు ప్రత్యేక గదులతో.. మూత్రశాల, మరుగుదొడ్డి నిర్మించారు. వీటి వరకు రూ.31.20 లక్షలు ఖర్చు చేశారు. ఒక్కో యూనిట్‌ను ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం శుభ్రం చేసి ఓవర్‌హెడ్‌ ట్యాంకుల్లో నీటిని నింపే బాధ్యత గుంటూరుకు చెందిన క్యూబ్‌ బయో అనే ఏజెన్సీకిచ్చారు. ఇందుకుగానూ ఒక్కో మరుగుదొడ్డికి నెలకు రూ.2 వేలు చొప్పున రూ.1.04లక్షలు, ఏడాదికి రూ.12.48 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఆరు నెలలు సక్రమంగా నడిచిన నిర్వహణ ఆ తర్వాత ఏజెన్సీ చేతులెత్తేయడంతో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి.

పరిష్కార మార్గాలు వెతకలేదు...

నీటి సౌకర్యం లేక రెండేళ్లుగా ఆధునిక మరుగుదొడ్లు మూలకు చేరాయి. కొన్నింటికి తాళాలు వేశారు. మరికొన్ని చూడటానికే అధ్వానంగా మారాయి. నగరపాలక సంస్థ ట్యాంకర్లతో విభాగినిల మధ్య చెట్లకు నీళ్లు పోస్తున్నారు కానీ, ప్రజలకు అవసరమైన మరుగుదొడ్లపై ఉన్న చిన్నపాటి ట్యాంకులను నింపలేకపోతున్నారు. ఫలితంగా ప్రధానంగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు నరకం చూస్తున్నారు. రోజూ ఇతర గ్రామాలు, ప్రాంతాల నుంచి రెండు లక్షల పైగా ప్రజలు కర్నూలు నగరానికి వస్తుంటారు. సర్వజన వైద్యశాలకు నిత్యం వేలల్లోనే రోగులు వైద్యసేవలకు వస్తారు. ఆసుపత్రి నుంచి వైద్య కళాశాల వరకు మధ్యలో నాలుగు చోట్ల ఈ మరుగుదొడ్లు పనిచేయకపోవడంతో రోడ్లపైనే బహిరంగ విసర్జన చేస్తున్నారు. దీంతో స్వచ్ఛత సన్నగిల్లుతోంది.

 

ఉన్నవి వదిలి కొత్తవాటిపై దృష్టి...

నగరపాలక సంస్థలో రూ.లక్షలు ఒకవైపు వృథా అవ్వగా, మరోవైపు కొత్తగా ‘నమ్మ’ మరుగుదొడ్ల ఏర్పాటుకు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఫ్యాబ్రికేటెడ్‌ నమ్మ మరుగుదొడ్లు ఏర్పాటు చేసి అక్కడే బోరు సదుపాయం కల్పించాలని ప్రణాళికలు జరిగాయి. ఇవి ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ప్రజారోగ్య శాఖకు స్థలాలు(లొకేషన్‌) గుర్తించే బాధ్యతలిచ్చారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో ఎన్నికల అనంతరం వీటిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై డీఈ షాకీర్‌ను ‘ఈనాడు’ వివరణ కోరగా...నమ్మ టాయిలెట్స్‌ ఏర్పాటు చేయాలన్న ఆలోచన నిజమేనని, అదే సమయంలో నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లకు సైతం నీటి సరఫరా ఏర్పాటు చేసి అన్నింటిని అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని