Updated : 28/02/2021 06:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోరు విస్పష్టం..సమరానికి సన్నద్ధం


ఆళ్లగడ్డలో పుర ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: పురపోరుకు అటు అధికారులు.. ఇటు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తుండగా ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసినవారు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థ, ఎనిమిది పురపాలకాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గతేడాది మార్చిలో ఎక్కడ ఎన్నికల ప్రక్రియ ఆగిందో అక్కడినుంచే తిరిగి ప్రారంభమైంది. మార్చి 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ, 10న పోలింగ్, 14న లెక్కింపు జరుగుతుంది.

ఊపందుకున్న ప్రచారం
ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పట్టణాల్లో నేతల ప్రచారం పుంజుకుంది. తొమ్మిది మున్సిపాలిటీల్లో 2,061 మంది ఆశావహులు ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. వైకాపా నుంచి 790, తెదేపా 514 నుంచి నామినేషన్లు దాఖలు కాగా 382 మంది స్వతంత్రులు నామినేషన్లు వేశారు. ఆ తర్వాత స్థానంలో భాజపా 145, కాంగ్రెస్‌ 42, సీపీఐ 34, సీపీఎం 29, జనసేన 33, ఏఐఎంఐఎం 10, బీఎస్పీ 7.. ఇతరులు 74 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పలువురు అభ్యర్థులు బీ ఫారాల కోసం తమ నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రధాన పార్టీల నుంచి పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేయడంతో వారిని బరిలో నుంచి ఉపసంహరించుకునేలా బుజ్జగిస్తున్నారు. కాగా బెర్తులు ఇప్పటికే ఖరారైన అభ్యర్థులు మాత్రం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పట్టణాల్లో బహుళ అంతస్తుల్లోని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు.

సజావుగా నిర్వహించేలా..
పంచాయతీ ఎన్నికలను దిగ్విజయంగా నిర్వహించిన నేపథ్యంలో పుర ఎన్నికలను సైతం అదే స్థాయిలో జరిపేలా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.  అందుకనుగుణంగా ఇప్పటికే ఎన్నికల సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. బ్యాలెట్‌ పేపర్లు, బాక్సులు, పోలింగ్‌ కేంద్రాలు, ఎన్నికల సిబ్బంది, వాహనాలు,   ఇతర సామగ్రి ఏమేమి అవసరమో పరిశీలించి ఆయా ప్రాంతాలకు పంపేలా చర్యలు చేపట్టారు. 

సమస్యాత్మక కేంద్రాల్లో గట్టి నిఘా
ఒక కార్పొరేషన్, ఎనిమిది మున్సిపాలిటీల్లోని 302 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు 979 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కర్నూలులో అత్యంత సమస్యాత్మక కేంద్రాలు 14 ఉన్నట్లు గుర్తించారు. నంద్యాల    72, ఆదోని 83, ఎమ్మిగనూరు 8, డోన్‌ 38, నందికొట్కూరు 7, ఆత్మకూరు 4, ఆళ్లగడ్డ 14, గూడూరులో 12 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు తేల్చారు. కర్నూలులో 117 సమస్యాత్మక కేంద్రాలు, నంద్యాలలో 40,  ఆదోని 42, ఎమ్మిగనూరు 7, డోన్‌ 26, నందికొట్కూరు 22, ఆత్మకూరు 40, ఆళ్లగడ్డ 25, గూడూరులో 3 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. ఆయా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ  ఘటనలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. 

ఉదయం 7 నుంచే పోలింగ్‌ 
పంచాయతీ ఎన్నికల తరహాలోకాక ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 979 పోలింగ్‌ కేంద్రాలకు 7,710 మంది సిబ్బందిని నియమించనున్నారు. 227 చిన్న, 223 మధ్యస్థ, 1,672 పెద్ద బ్యాలెట్‌ పెట్టెలతోపాటు 11,89,170 బ్యాలెట్‌ పేపర్లు సిద్ధం చేశారు. పోలింగ్‌ కేంద్రం వద్ద కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని