Published : 22/04/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పరీక్షలు.. పడకల సంఖ్య రెట్టింపు

 వైరస్‌ కట్టడిపై మంత్రి బుగ్గన

ఎస్పీకి జ్ఞాపిక అందజేస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, కలెక్టర్‌

వీరపాండియన్‌, చిత్రంలో ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌

కర్నూలు వైద్యాలయం, నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: కరోనా రెండోదశ కట్టడికి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో కొవిడ్‌ కట్టడి చర్యలు, టీకా పంపిణీపై కలెక్టర్‌ వీరపాండియన్‌, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్‌, ఆర్థర్‌, ఎస్పీ ఫక్కీరప్ప, నగరపాలకసంస్థ మేయర్‌ బీవై రామయ్యతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహంచారు. బుగ్గన మాట్లాడుతూ గత సంవత్సరం దేశంలో ఎక్కువ కరోనా కేసులు నమోదైన జిల్లాల్లో కర్నూలు ఒకటని, అప్పట్లో జిల్లా యంత్రాంగం సమర్థంగా వైరస్‌ను కట్టడిచేసి ప్రశంసలు పొందిందన్నారు. ప్రస్తుతం రోజుకు వెయ్యి కేసులు వరకు నమోదవుతున్నాయని, రోగులకు అవసరమైన మందులు, ఆక్సిజన్‌ వంటివి కొరత లేకుండా చూస్తామన్నారు. జిల్లాలో రోజుకు నాలుగువేల నమూనాలు సేకరిస్తున్నారని, వారంలోగా కొవిడ్‌ పరీక్షలు రెండింతలు చేసేలా చూస్తామన్నారు. నంద్యాల, ఆదోనిలో ల్యాబ్‌లను ఏర్పాటుచేసి ఒకరోజులోనే ఫలితం వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను వెంటనే నియమించుకోవాలని, 104కు కాల్‌చేస్తే పరీక్షలు చేసేలా ఆదేశాలు ఇచ్చామని వివరించారు. జిల్లాలో 18 కొవిడ్‌ ఆసుపత్రులను గుర్తించామని, 1,250 పడకలు, 350 ఐసీయూ బెడ్లు ఉన్నాయని ఈ సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్‌ వీరపాండియన్‌ మాట్లాడుతూ జిల్లాలో 3.4 లక్షల మందికి టీకాలు వేసినట్లు పేర్కొన్నారు. టీకా పంపిణీకి ప్రతిరోజూ ప్రత్యేక డ్రైవ్‌ చేపడుతున్నామని, 46 వేల టీకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ● బుధవారం నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రితోపాటు ఎస్సార్బీసీ కాలనీలోని టిడ్కో భవనాలను కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి, ఇన్‌ఛార్జి డీసీహెచ్‌ఎస్‌ డా.శిరీష, ఆసుపత్రి పర్యవేక్షకుడు డా.విజయ్‌కుమార్‌, తహసీల్దార్‌ రవికుమార్‌, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

సాధారణ రోగులకూ వైద్యం అందాలి: అధికారులు, ప్రజాప్రతినిధులతో బుగ్గన నిర్వహించిన సమావేశంలో పలువురు క్షేత్రస్థాయి సమస్యలను నివేదించారు. కోడుమూరు ఎమ్మెల్యే డా.సుధాకర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ రోగులతోపాటు నాన్‌ కొవిడ్‌ రోగులకు సర్వజన వైద్యశాలలో చికిత్స అందించాలని, గతంలో సాధారణ రోగులకు చికిత్సలు అందలేదనే ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ పెద్దాసుపత్రి వద్ద ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వాహకులు కొవిడ్‌ రోగుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

పెద్దకడబూరు ఠాణా గర్వకారణం

కర్నూలు నేరవిభాగం: జాతీయ పురస్కారం సాధించిన పెద్దకడబూరు ఠాణా రాష్ట్రానికే గర్వకారణమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పురస్కారం సాధించడంపై బుధవారం ఆయన సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో ఎస్పీ డాక్టర్‌ కె.ఫక్కీరప్ప, ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్‌, కోసిగి సీఐ ఈశ్వరయ్య, ఎస్సై శ్రీనివాసులును సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని