Published : 22/04/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్థలాలు స్వాహా..

● పట్టనట్లు వ్యవహరిస్తున్న పట్టణ ప్రణాళిక

● మేయర్‌ వార్డులోనే రూ.7 కోట్ల భూమి కబ్జా

కర్నూలు (బుధవారపేట), న్యూస్‌టుడే: నగరపాలక సంస్థ స్థలాలు అక్రమార్కులు పరం అవుతున్నాయి. లేఅవుట్‌ పరిధిలోని ప్రజల ఉమ్మడి ఆస్తులను కబ్జా చేస్తున్నది కొందరైతే ఉద్యానవనాలకు కేటాయించిన రూ.కోట్ల స్థలాల్లో భవంతులు నిర్మిస్తున్నది మరికొందరు. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్లు పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల కనుసన్నల్లో ఈ తంతు నడుస్తుండటం విశేషం.

కర్నూలు నగరంలో సుమారు 6 లక్షలకుపైగా జనాభా ఉంది. 130 కాలనీల్లోని 275 ఉద్యానవనాలు నగరపాలక సంస్థ ఆధీనంలో ఉన్నాయి. ఇవికాకుండా వందకుపైగా పార్కు స్థలాలను అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జా చేసి ఎవరి అనుమతి లేకుండా భవనాలు నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

నగర ప్రథమ పౌరుడైన మేయర్‌ బీవై రామయ్యకు చెందిన 19వ వార్డులోని శ్రీరామ్‌ నగర్‌లోని ఇంజినీర్స్‌ కాలనీలో రూ.7 కోట్ల స్థలం కబ్జాకు గురైంది. పార్కు స్థలాలను ధర్మకర్తగా రక్షించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థకు ఉంటుంది. ఇంత పెద్ద భవన నిర్మాణం జరుగుతున్నా అధికారులు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.

కొండారెడ్డి బురుజు సమీపంలోని షరాఫ్‌ బజార్‌లో అక్రమ భవనాలు గుర్తించి వాటి యజమానులకు ఆరునెలల కిందట తాఖీదులు ఇచ్చారు. పూర్తిగా ఎనిమిది భవనాలు అక్రమంగా నిర్మించినట్లు గుర్తించినా.. నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ విషయమై రాష్ట్రస్థాయి విజిలెన్సు డీజీపీ అధికారి నివేదిక అడిగారు. కోర్టు పరిధిలో ఉన్న దుకాణాలకు విద్యుత్తును పునరుద్ధరించుకొని వ్యాపారాలు సాఫీగా చేసుకుంటున్నారు. విద్యుత్తు సరఫరా విషయంలో పట్టణ ప్రణాళిక అధికారులు సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.

మామూళ్లకు అలవాటుపడి:

నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాలు, ఉద్యాన వనాలు ఆక్రమణకు గురవుతుండటంపై వార్డు ప్రణాళికా కార్యదర్శులతో సర్వే చేయించిన ఓ పట్టణ ప్రణాళిక ముఖ్య అధికారి అక్రమార్కులకు తాఖీదులు ఇచ్చి బహిరంగ మార్కెట్‌లో ఉన్న ఆస్తి విలువనుబట్టి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ చెప్పినా పట్టణ ప్రణాళిక అధికారి ఇష్టం వచ్చినట్లు వ్యవహ రిస్తున్నట్లు తెలు స్తోంది.

శ్రీరామ్‌నగర్‌లోని ఇంజినీర్స్‌ కాలనీలో ఉద్యాన వనం కోసం 33 సెంట్ల స్థలాన్ని కేటాయించగా నగరానికి చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి కబ్జా చేసి ఎవరికీ అనుమానం రాకుండా ఆ స్థలంలో 2014లో ఆలయం నిర్మించారు. లాక్‌డౌన్‌ సమయంలో అధికారులందరూ కొవిడ్‌ కట్టడిపై దృష్టి పెట్టడంతో వ్యాపారి అదే అదునుగా తీసుకొని సుమారు 20 సెంట్ల స్థలంలో 2020 నవంబరులో ప్రైవేటు భవనం నిర్మించారు. కాలనీవాసులు కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్థలాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణంగా గుర్తించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారి కోటయ్యకు సూచించారు. అయితే ఇంతవరకు ఎలాంటి చర్యలు లేకపోవడంతో కాలనీవాసులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌ వీరపాండియన్‌కు లేఖ వచ్చింది. ఆక్రమణ విషయంలో పట్టణ ప్రణాళిక విభాగంలోని ఓ ఉన్నతాధికారికి పెద్ద మొత్తంలో సొమ్ము వెళ్లినట్లు ఆరోపణలున్నాయి.

కొండారెడ్డి బురుజు సమీపంలోని శ్రీనివాస క్లాత్‌ మార్కెట్‌లో సత్యసాయిబాబా కల్యాణ మండపాన్ని పార్కింగ్‌ స్థలంలో నిర్మించారు. ఈ స్థలాన్ని కేవలం గ్రంథాలయంగా వినియోగించుకోవాలని గతంలో అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే ఆ ఆదేశాలు బేఖాతరు చేసి ప్రస్తుతం ఆ స్థలంలో పెద్దపాటి భవనం నిర్మించి అక్కడి అసోసియేషన్‌ వారు రూ.కోట్లు గడిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు వార్తలు ప్రచురితమయ్యాయి. దీనిపై ఏవిధంగా ముందుకు వెళ్లాలనే విషయమై డీటీసీపీ రాముడుకి కమిషనర్‌ లేఖ రాశారు. పరిశీలించిన డీటీసీపీ గతంలో ఇచ్చిన అనుమతిని మాత్రమే అమలు చేయాలని, అక్రమంగా నిర్మించినట్లయితే క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని మూడునెలల క్రితమే సూచించారు. ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నగరంలో లేఅవుట్లు: 500

వాటిలోని పార్కు స్థలాలు: 300

కబ్జాకు గురైనవి: 100కుపైగా

నరగపాలక పరిధిలోని ఉద్యాన వనాలు: 275

వినియోగంలో లేనివి: 75


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని