Published : 22/04/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆశలు నేల రాలాయి

జిల్లాలో రూ.8 కోట్లకు పైగా నష్టం


గాలివానకు రాలిన కాయలతో రైతు వెంకటరమణ

ఓర్వకల్లు, డోన్‌ గ్రామీణ, బేతంచెర్ల, ప్యాపిలి, న్యూస్‌టుడే: మామిడి తోటలను కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న కర్షకుల ఆశలు ఆవిరవుతున్నాయి. అకాల వర్షాలు, గాలివాన బీభత్సానికి కౌలు రైతుల జీవితాలపై పిడుగు పడింది. ప్రతి ఏడాది ఎన్ని ఆటంకాలు ఎదురైనా రేయింబవళ్లు కళ్లు కాయలు కాసేలా మామిడి చెట్లను పూత నుంచి పిందెల వరకు కంటికి రెప్పలా కాపాడుకున్నా తీరా దిగుబడి చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు, గాలివానకు జరగరాని నష్టం జరిగి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమను పరామర్శించటం తప్ప ఫలితం శూన్యమని బాధిత రైతులు వాపోతున్నారు. ప్రధానంగా ఓర్వకల్లు, డోన్‌, బేతంచెర్ల, వెల్దుర్తి, ప్యాపిలి మండలాల్లో మామిడి తోటల పెంపకం అధికంగా ఉంది. ఓర్వకల్లు, బేతంచెర్ల మండలాల్లోని కాల్వ, హుసేనాపురం, పాలకొలను, ఉప్పలపాడు, ఉయ్యాలవాడ, ఎంబాయి, రుద్రవరం గ్రామాల్లో ఐదు వేల ఎకరాల్లో మామిడి తోటలను సాగు చేశారు. యజమానుల నుంచి తోటలను కౌలుకు తీసుకుని మునుగుత్త చెల్లించి తోటల్లోకి దిగిన కౌలురైతులు ఏటా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష దాకా కౌలు చెల్లించిన సాగుదారులకు నిరాశే మిగులుతోంది. ఈ ఏడాది పలు గ్రామాలకు చెందిన కౌలురైతులు తోటలను గుత్తకు తీసుకుని సాగు చేసినా గాలివాన బీభత్సానికి చెట్ల కొమ్మలు విరిగిపోయి కాయలు సైతం రాలిపోయాయి. గతంలో కురిసిన వర్షానికి ఉన్న పూత రాలిపోయి పంట అంతంతమాత్రంగా ఉండగా, ప్రస్తుతం గాలివానకు కాయలు మొత్తం రాలిపోయాయి. దీంతో పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితి ఏర్పడిందని పలువురు కౌలురైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఓర్వకల్లు, డోన్‌, బేతంచర్ల మండలాల్లో మామిడి కాయలు రాలిపోయి వెయ్యి ఎకరాల వరకు నష్టం వాటిల్లగా రూ.8 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. ఓర్వకల్లులో మామిడితోపాటు బొప్పాయి, అరటి తోటలు దెబ్బతిన్నాయి. డోన్‌, ప్యాపిలి మండలాల్లోనూ అరటికి పెద్ద నష్టం వాటిల్లింది. డోన్‌ మండలంలో 15 హెక్టార్లలో అరటి, బొప్పాయి 10 హెక్టార్ల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.

పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి - రామ మద్దిలేటి, పాలకొలను, రైతు

ఏటా రూ.లక్షల్లో అప్పులు చేసి మామిడి తోటలను కౌలుకు తీసుకుంటున్నాం. వీటితోనే కుటుంబాలను పోషించుకుంటున్నాం. మామిడి కాయల వ్యాపారం అలవాటుగా మారటంతో కాలం కనికరించి లాభాలు గడిస్తామనుకుంటున్నాం. కానీ విధి వక్రీకరించటంతో నష్టాల బారిన పడుతున్నాం. నష్టం జరిగినప్పుడల్లా నాయకులు, అధికారులు పర్యటనలతో సరిపెడుతున్నారు తప్ప మాకెలాంటి పరిహారం అందేలా చర్యలు తీసుకోవటంలేదు. ఇప్పటికైనా పరిహారం అందేలా చూడాలి.

అరటికి పెద్ద నష్టం వాటిల్లింది - రాముడు, పీఆర్‌పల్లె

మూడెకరాల్లో అరటి సాగు చేశా. రూ.5 లక్షలకు పైగా ఖర్చు చేశా. కాపు చేతికొచ్చే సమయంలో గాలివాన బీభత్సానికి అరటితోట చాలావరకు చెట్లు నేలరాలిపోయాయి. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఇక ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. లేకపోతే అప్పులపాలు కావాల్సిందే.

రాత్రింబవళ్లు కష్టపడినా నష్టాలు తప్పటంలేదు - స్వాములు, సోమయాజులపల్లె, రైతు

మామిడి తోటల సాగుతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకున్న నాలుగు ఎకరాల్లోని మామిడి తోటకు పూతను కాపాడుకునేందుకు రూ.2.50 లక్షల దాకా ఖర్చు చేశాను. ధర బాగుండటంతో రూ.10 లక్షల ఆదాయం వస్తుందనుకున్న సమయంలో గాలివానతో జరగరాని నష్టం జరిగింది. రాత్రింబవళ్లు కష్టపడినా ఏటా దిగుబడి వచ్చే సమయంలో అకాల వర్షాలు, గాలివాన బీభత్సానికి కాయలు మొత్తంగా రాలిపోయి తీవ్రనష్టం జరుగుతోంది.

అరటి, బొప్పాయికి ప్రతిపాదనలు పంపుతున్నాం - రఘునాథరెడ్డి, ఉద్యాన శాఖ ఏడీ

గాలివాన బీభత్సానికి జిల్లాలో అరటి, బొప్పాయి నష్టాలపై వివరాలు సేకరించి ప్రతిపాదనలు పంపుతున్నాం. మామిడి కాయలు రాలిపోయిన వాటికి ప్రతిపాదనలు పంపమని మాకు ఉత్తర్వులు లేవు. ఏటా వారికి నష్టం వాటిల్లుతున్నా ఆదుకోవటానికి మాకు ఎలాంటి అధికారాలు లేవు.

కాల్వ గ్రామంలో విరిగిపడిన బొప్పాయి చెట్లు

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని