Published : 22/04/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బ్యాంకు విధులకు వెళుతూ మృత్యువాత

తల్లిని ఓదార్చుతున్న కుమారులు

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: శ్రీరామ నవమి పండగ సందర్భంగా ఇంట్లో పూజ ముగించుకొని విధులకు వెళుతున్న బ్యాంకు ఉద్యోగి సింగిరి చామరాజు(56) ప్రాణాలను లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఈ దుర్ఘటన బుధవారం ఆదోని ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ ఎదురుగా చోటు చేసుకుంది. ట్రాఫిక్‌ పోలీసులు, స్థానికుల కథనం మేరకు... స్థానిక టెలికాం కాలనీలో సింగిరి చామరాజు, కృష్ణవేణి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు తరుణ్‌కుమార్‌, కిరణ్‌కుమార్‌ ఉన్నారు. చామరాజు స్థానిక జీహెచ్‌ రహదారిలోని స్టేట్‌ బ్యాంకులో క్లర్క్‌ కమ్‌ క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీరామ నవమి పండగ సందర్భంగా ఆయన ఉదయమే ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం క్యారియర్‌ పెట్టుకొని ద్విచక్రవాహనంపై బ్యాంక్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ సమీపంలో వెనుకవైపు నుంచి వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో చామరాజు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. పంచనామా నిర్వహించి పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆదోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న భార్య, కుటుంబ సభ్యులు, తోటి బ్యాంకు ఉద్యోగులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని శోకసంద్రంలో మునిగారు. మృతుడి కుమారుడు తరుణ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మయ్య తెలిపారు.

సింగిరి చామరాజు (పాత చిత్రం)


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని