Published : 22/04/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మొక్కపై మమకారం.. చుక్కనీటికి ఆరాటం!


పొలంలో నాటిన జామ చెట్లు ( అంతర్‌ చిత్రంలో) బిందెలతో నీరు తెస్తున్న శేఖర్‌, ఆయన కుమార్తె

పచ్చని మొక్క పెరగాలంటే నీటి తడుపు కావాలి. అప్పుడే అది మానుగా మారి నీడనిస్తుంది. పళ్లిచ్చి ఆకలి తీరుస్తుంది. ఆ ఆశతో నాటిన మొక్కలు నీటి జాడ లేక కంటి ముందే ఎండిపోతుంటే ఆ కర్షకుడి బాధ వర్ణనాతీతం. కుళాయి నీటితోనే వాటికి తడుపునందిస్తూ అతికష్టం మీద కాపాడుకుంటున్నారు. కొత్తపల్లి మండలం శివపురం గ్రామానికి చెందిన శేఖర్‌కు బట్టువారిపల్లికి వెళ్లే రహదారిలో 1.25 ఎకరాల భూమి ఉంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా అధికారులు ఉచితంగా ఇచ్చిన 125 జామ మొక్కల్ని పొలంలో నాటారు. శివపురం చెరువు, సంగమేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి వచ్చే నీటితో వాటిని పెంచి, ఆదాయం పొందవచ్చనుకున్నారు. అయితే వేసవి కారణంగా చెరువులో నీరు అడుగంటడం, ఎత్తిపోతల నీరు రాకపోవడంతో పరిస్థితి తారుమారైంది. దీంతో రోజూ తన భార్య, కుమార్తెతో కలిసి ఓ కిలోమీటర్‌ దూరంలో ఉన్న బట్టువారిపల్లిలోని కుళాయి నుంచి సైకిల్‌పై బిందెలతో నీరు తెచ్చి ఒక్కో మొక్కకు పోస్తూ కాపాడుకుంటున్నారు. పొలం తక్కువగా ఉన్న కారణంగా వైఎస్‌ఆర్‌ జలకళ తనకు వర్తించదని, సొంతంగా బోరు వేసుకునే స్థోమత లేదని ఆవేదనతో తెలిపారు. - న్యూస్‌టుడే, కొత్తపల్లి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని