Published : 22/04/2021 05:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జాతి సేవలో పాలుపంచుకోవాలంటే..

● కొంచెం కష్టపడితే ఆర్మీలో ఉద్యోగం ●

దరఖాస్తుకు 30 వరకు అవకాశం

 

రాజేంద్రనగర్‌(గుంటూరు), న్యూస్‌టుడే : గుంటూరుకు చెందిన బాషా, శ్రీకాంత్‌ మిత్రులు. ఇద్దరూ డిగ్రీ పూర్తి చేసి ఆర్మీలో చేరాలనే ఆలోచనతో శిక్షణ పొందారు. బాషాకు ఉద్యోగం రాగా, శ్రీకాంత్‌ పలు ప్రయత్నాలు చేసి విఫలం కావడంతో ప్రభుత్వ ఉద్యోగానికి దూరమయ్యాడు. ఏదో ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం పొందాడు. కొవిడ్‌ కారణంగా శ్రీకాంత్‌ ఉద్యోగం పోయింది. బాషాలాగా ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కానందుకు అతను నేటికీ బాధపడుతూనే ఉన్నాడు.

నేడు ప్రభుత్వ కొలువు పొందడం కష్టమైనా.. కష్టపడితే సాధ్యమే. ప్రభుత్వ ఉద్యోగానికి భద్రత ఎక్కువనే విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా విరమణ అనంతరం పెన్షన్‌ సదుపాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించాయి. త్రివిధ దళాల్లో(ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌) నేటికీ పెన్షన్‌ సదుపాయం ఉంది. సైన్యంలో నిర్ణీతకాలం పని చేసిన తర్వాత కావాలనుకుంటే పదవీ విరమణ చేయొచ్ఛు తర్వాత మాజీ సైనిక ఉద్యోగులుగా రిజర్వేషన్‌ వర్తిస్తుంది. ఫలితంగా కేంద్రప్రభుత్వ ఉద్యోగాలైన బ్యాంకులు, రైల్వేలు, రాష్ట్ర స్థాయి గ్రూప్‌-1, గ్రూప్‌-2తో పాటు పలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంపికకు అవకాశం ఉంది.

గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఆధ్వర్యంలో మే 16 నుంచి 30వ తేదీ వరకు ర్యాలీ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో ఈ ఎంపికలు వాయిదా పడినా ర్యాలీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 30వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది.

 

అర్హులు: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు

పోస్టులు:

1. సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ(10వ తరగతి)

2. సోల్జర్‌ టెక్నికల్‌ (ఇంటర్‌ ఎంపీసీ).

3. సోల్జర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌/నర్సింగ్‌ అసిస్టెంట్‌ వెటర్నరీ(ఇంటర్‌ బైపీసీ),

4. సోల్జర్‌ క్లర్క్‌(ఇంటర్‌),

5. స్టోర్‌ కీపర్‌ క్లర్క్‌ (ఇంటర్‌),

6. స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌, సోల్జర్‌ ట్రేడ్‌మెన్‌ (10వ తరగతి పాస్‌)

వయస్సు: సోల్జర్‌ జనరల్‌ డ్యూటీకి అభ్యర్థులు 17 1/2 నుంచి 21 సంవత్సరాలలోపు ఉండాలి. మిగతా పోస్టులకు గరిష్ట వయోపరిమితి 23 సంవత్సరాలు.

ఎంపిక విధానం: ఫిజికల్‌, మెడికల్‌, రాత విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఆటలు, ఎన్‌సీసీ విభాగాల్లో ధ్రువపత్రాలు సాధించిన వారికి స్థాయిని బట్టి బోనస్‌ మార్కులు ఇస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం

ముందుగా అంతర్జాలంలో www.joinindianarmy.nic.in క్లిక్‌ చేయాలి. కాప్చా అడిగిన చోట ఆ నెంబర్‌ను ఖాళీలో నమోదు చేయాలి. అక్కడ జేసీవో/ఎన్‌రోల్‌మెంట్‌ విభాగం వస్తుంది. అందులో కుడివైపు ఇంతకుముందు రిజిస్టర్‌ చేసుకుంటే యూసర్‌ పేరు, పాస్‌వర్డ్‌, కాప్చా ఎంటర్‌ చేయాలి. ఎడమవైపు న్యూ రిజిస్ట్రేషన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేయడానికి నియమాలు వస్తాయి. తర్వాత కంటిన్యూను నొక్కాలి. వ్యక్తిగత వివరాల్లో రాష్ట్రం, ఆధార్‌ నెం, 10వ తరగతిలో ఉన్నవిధంగా అభ్యర్థి, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, ఈమెయిల్‌ చిరునామా, ఫోన్‌ నెంబర్‌ నమోదు చేసి టిక్కు మార్కు వేసి సబ్‌మిట్‌ చేయాలి. వివరాలను ఒక్కసారి నమోదు చేసుకొని సబ్‌మిట్‌ చేసిన తర్వాత మళ్లీ మార్చలేం కాబట్టి మరోసారి సరిచూసుకోవాలి. తర్వాత మెయిల్‌కు వచ్చిన 5 అంకెల ఓటీపీని నిర్ణీత ప్రదేశంలో నమోదు చేయాలి. ఇక్కడ విద్యార్హతలు, 10వ తరగతి మార్కుల జాబితాను సబ్‌మిట్‌ చేయాలి. ఇక్కడ యూసర్‌ పేరును ఈమెయిల్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌ను సెట్‌ చేయాలి. ఈ స్క్రీన్‌లో వచ్చిన క్యాప్చా నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. ఇక్కడ తెల్ల కాగితంపై ఫొటో అంటించి, సంతకం చేయాలి. లిట్‌ ఫొటో అనే యాప్‌ ద్వారా తక్కువ కేబీలో కంప్రెస్‌ చేసి అప్‌లోడ్‌ చేసి సేవ్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి. డాష్‌ బోర్డులో ఎడమవైపు అప్లై ఆన్‌లైన్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి. ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారో దానిపైన అప్లై ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. ఆటలు, ఎన్‌సీసీ విభాగాల్లో ధ్రువపత్రాల వివరాలు, 10 బోర్డు, రాష్ట్రం, మార్కుల జాబితా నెంబరు, మార్కులు తదితర వివరాలను పేర్కొని ఒకటికి రెండుసార్లు పరిశీలించుకొని సబ్‌మిట్‌ చేయాలి. మీ అప్లికేషన్‌ విజయవంతం అని కనిపిస్తుంది. ఇక్కడ మొదట మన ఫొటో కనిపిస్తుంది. అభ్యర్థి, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, జాతీయతను ఇండియన్‌గా పేర్కొనాలి. మతం, లింగం, ఎత్తు, పురుషుడు, అడ్రస్‌ వివరాలు ఇచ్చి ఎడిట్‌ బటన్‌ నొక్కాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని