మూడు బిస్కెట్లు.. ఆరు ఆభరణాలు
eenadu telugu news
Updated : 12/07/2021 09:51 IST

మూడు బిస్కెట్లు.. ఆరు ఆభరణాలు

దర్జాగా బంగారం, వెండి జీరో దందా

 ఎలాంటి బిల్లుల్లేకుండా రూ.కోట్లల్లో వ్యాపారం 

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు: అంచనా వేయని వ్యాపారం ఏదైనా ఉందంటే.. అది పసిడి వ్యాపారమే. ఇటీవల కాలంలో అక్రమార్జనకు ఇది కేంద్ర బిందువుగా మారింది. ఎక్కువగా జీరో దందా సాగిస్తున్నారు. పన్నులు చెల్లించకుండా, ఎలాంటి బిల్లులు లేకుండా మూడు బంగారు, ఆరు వెండి బిస్కెట్లు అన్న చందంగా తయారైంది. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పట్టుబడితే తప్ప ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ దందాను ఛేదించేవారు కరవయ్యారు. బులియన్‌ మార్కెట్‌గా పేరొందిన ఆదోని, నంద్యాల, కర్నూలు నగరంలో అనధికారక అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

తక్కువ సమయంలో ఎక్కువ సంపాదనకు..

తక్కువ సమయంలో ఎక్కువ సంపాదనకు బంగారం అక్రమ వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు. ఏడాదికి కోటిన్నరలోపు వ్యాపారం చేసేవారు 1%, ఆపై వ్యాపారం చేసేవాళ్లు 3% పన్నును వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది అంచనా వేయలేని వ్యాపారం కావడంతో ముంబయి, హైదరాబాద్‌, చెన్నై, సేలం వంటి నగరాల నుంచి బిల్లుల్లు లేకుండా బంగారం, వెండి కొనుగోలు చేసుకుని తెచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. అదే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఎక్సైజ్‌ డ్యూటీ 12% పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. శ్రీలంక దేశం నుంచి వచ్చే బంగారం సముద్ర మార్గంలో అక్రమంగా చెన్నై, నెల్లూరుకు చేరి అక్కడి నుంచి ఎలాంటి బిల్లుల్లేకుండా తక్కువ ధరకు వ్యాపారుల చెంతకు చేరుతోంది. ఇలా అందరి కళ్లుగప్పి జీరో దందాకు తెగబడుతున్నారు.

అధికారుల నిఘా కొరవడి..

కర్నూలులో అత్యధికంగా 300, నంద్యాలలో 200, ఆదోనిలో 60-70 బంగారు, వెండి దుకాణాల్లో వ్యాపారం సాగుతోంది. రోజుకు సగటున 10 కిలోల వరకు అమ్మకాలు జరుగుతాయి. పెళ్లిళ్ల సీజనులో అయితే రోజుకు 15-20 కిలోల బంగారాన్ని విక్రయిస్తుంటారు. పశ్చిమ ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఆదోనిలో ఎలాంటి బిల్లుల్లేకుండా బంగారు ఆభరాణాలు అమ్ముతారు. ఇక వెండి విక్రయాలైతే ప్రతిరోజూ 250 కిలోలకుపైగా జరుగుతాయి. ఇలా ప్రతిరోజూ రూ.కోట్లల్లో వ్యాపారం సాగుతున్నా.. అందులో సక్రమం ఎంత అనే కోణంలో నిఘా పెట్టి ఆట కట్టించేవారు కరవయ్యారు.

సీజన్‌ బాయ్స్‌తో సరకు...

సున్నా (జీరో) దందాకు నమ్మకమైన వ్యక్తులను (సీజన్‌ బాయ్స్‌) ఏర్పాటు చేసుకుంటారు. వారికి నమ్మకంగా నగదు ఇచ్చి చెన్నై, హైదరాబాద్‌ నుంచి జీరో దందాపై ఆభరణాలు, బంగారం, వెండి బిస్కెట్లు తెప్పిస్తారు. ప్రయాణికుల్లాగా బ్యాగు, సూట్‌కేసుల్లో సామగ్రిని పెట్టుకుని ఆర్టీసీ బస్సులు, కార్లు, రైలు మార్గాల ద్వారా వ్యాపారులకు చేరవేస్తారు. ఒక 100 గ్రాముల బంగారం బిస్కెట్‌.. బిల్లు లేకుండా అయితే వాస్తవ ధరకంటే రూ.23 వేల వరకు తక్కువకు వస్తుంది. ఇలా కిలోపై రూ.2.30 లక్షల వరకు లాభం పొందవచ్ఛు బహిరంగ మార్కెట్‌లో మాత్రం ఎంత ధర ఉందో అంతకే అమ్ముతారు. కానీ బిల్లులు ఇవ్వరు. ఇంత లాభం ఉండటంతో ఒక్కసారి వెళ్తే.. 5 కిలోల వరకు కొనుగోలు చేసుకుని వస్తారు. కొందరైతే నెలకు నాలుగైదుసార్లు వెళ్లి కొనుగోలు చేసుకొస్తుంటారు.

జిల్లాకు చేరుస్తున్నారు ఇలా...

ఆర్టీసీ బస్సులు, కార్లలో హైదరాబాద్‌ నుంచి కర్నూలు, రాయలసీమ జిల్లాలతోపాటు బెంగళూరుకు బంగారం తరలుతోంది. ఇక రెండో ముంబయిగా పేరొందిన ఆదోనికి రైలు మార్గంలో వస్తోంది. ఆదోని రైల్వేస్టేషన్‌ నుంచి ప్రధాన ప్రాంతాలకు రైలుమార్గం అందుబాటులో ఉండటంతో కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి ప్రాంతాల నుంచి బంగారు, వెండి నగల రవాణా సులువుగా జరుగుతోంది. నెల్లూరు నుంచి బిల్లుల్లేని బంగారం నంద్యాల కేంద్రానికి కార్లు, అవసరమైతే ద్విచక్ర వాహనాల్లో పెట్టుకుని తీసుకువస్తుండటం గమనార్హం.

కొన్ని సంఘటనలు ఇలా..

ఆదివారం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు కారులో తరలిస్తున్న 7 కిలోల బంగారాన్ని కర్నూలు శివారులోని పంచలింగా చెక్‌పోస్టు వద్ద పోలీసులు సీజ్‌ చేశారు. ఎలాంటి అనుమతుల్లేకుండా తరలిస్తున్న ఈ బంగారం విలువ సుమారు రూ.3 కోట్లు పైమాటే.

ఈ నెల 3న హైదరాబాద్‌ నుంచి కడపకు కారులో తరలిస్తున్న 42.06 కిలోల వెండిని పోలీసులు తనిఖీల్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.20 లక్షలు.

గత నెల 30న గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి ఆదోని షరాఫ్‌బజారులో విక్రయించేందుకు తెచ్చిన 1.874 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.70 లక్షల వరకు ఉంటుంది.

గత నెల 24న హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు ట్రావెల్‌ బస్సులో తరలిస్తున్న 5.85 కిలోల బంగారాన్ని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో గుర్తించారు. రూ.2.50 కోట్ల విలువైన 45 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకుని రవాణా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఏడు కిలోల బంగారు ఆభరణాల పట్టివేత

సీజ్‌ చేసిన ఆభరణాలతో నిందితుడు, సెబ్‌ అధికారులు

కర్నూలు నేరవార్తలు, న్యూస్‌టుడే: కర్నూలు మండలం పంచలింగాల వద్దనున్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులో అక్రమంగా రవాణా అవుతున్న ఏడు కిలోల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న తమిళనాడు రిజిస్ట్రేషన్‌ ఇన్నోవా వాహనాన్ని సెబ్‌ సీఐ శ్రీనివాసులు, సిబ్బంది ఆపి తనిఖీ చేయగా ఏడు కిలోల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదు బయటపడింది. కారులో ఉన్న బెంగళూరుకు చెందిన అజయ్‌ గడియా, డి.ప్రకాశ్‌ ఆభరణాలకు సంబంధించి ఎలాంటి ఆధారపత్రాలు చూపలేదు. నగరత్‌పేటలో సోవన్‌ జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తున్నామని, జుబ్లీహిల్స్‌లోని కృష్ణ జ్యువెలరీ దుకాణం నుంచి వాటిని తీసుకువస్తున్నట్లు చెప్పారు. అధికారులు డబ్బు, ఆభరణాలను సీజ్‌ చేసి కర్నూలు నగర పోలీసులకు అప్పగించారు. బంగారం విలువ రూ.3 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని