ఉద్యోగం పేరుతో మోసం
logo
Updated : 22/07/2021 06:29 IST

ఉద్యోగం పేరుతో మోసం

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

విచారిస్తున్న సీఐ శ్రీరాములు

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే : రైల్వే శాఖలో పొరుగు సేవల కింద ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి రూ.3 లక్షలు వసూలు చేసి ఓ యువకుడిని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసుల ఎదుట చెప్పుకోవడంలో అసలు విషయం బయటపడింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. దేవనకొండ మండలం పి.కోటకొండ గ్రామానికి చెందిన రంగన్న ఐటీఐ పూర్తి చేశారు. తల్లి పద్మావతమ్మ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పని చేస్తున్నారు. వీరికి కర్నూలు నగరం జొహరాపురం రహదారిలో నివాసం ఉంటున్న కిశోర్‌ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం పరిచయమయ్యాడు. రంగన్నకు రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. అనంతరం రైల్వే శాఖలో పొరుగు సేవల కింద ఉద్యోగం వచ్చింది, రూ.3 లక్షలు నగదు తీసుకొస్తే ఉద్యోగంలో చేరవచ్చని నమ్మించాడు. ఇది నిజమని నమ్మి తల్లి, కుమారుడు వారి బంధువు చెన్నకేశవులతో కలిసి ఆదోని రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న కిశోర్‌ చేతికి రూ.3 లక్షలు నగదు ఇచ్చారు. ఆ తర్వాత సదరు వ్యక్తి రంగన్నను రైల్వేస్టేషన్‌ లోపలికి తీసుకెళ్లి ఇక్కడే నీకు ఉద్యోగం అని చెప్ఫి. కొంత సేపటికి కనిపించకుండా పోయాడు. అనుమానం వచ్చిన బాధితుడు అక్కడి అధికారులకు వద్దకు వెళ్లి అసలు విషయం చెప్పాడు. ఎవరో నిన్ను మోసం చేశారని చెప్పడంతో కుటుంబ సభ్యులతో కలిసి కర్నూలులో ఉంటున్న కిశోర్‌ ఇంటికి వెళ్లి నిలదీశారు. తీసుకున్న డబ్బు వెనక్కి ఇవ్వమని గట్టిగా అడగడటంతో సరేనని చెప్పాడు. ఇప్పుడు.. అప్పుడు అంటూ కాలయాపన చేయడంతో చేసేదిలేక ఆదోని రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీరాములు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని